CM Jagan Delhi tour : అమిత్ షాతో కుదరని భేటీ.. ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన !
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన అమిత్ షాతోనూ సమావేశం అయ్యేందుకు ప్రయత్నించారు. కానీ కుదరలేదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండో రోజు కూడా ఆయన తీరిక లేకుండా పలువురు కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. కేంద్ర రవాణా మంత్రి గడ్కరీతో సమావేశమైన సీఎం జగన్.. విశాఖ నుంచి భోగాపురం వరకు జాతీయ రహదారి ఏర్పాటుపై చర్చించారు. విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి డీపీఆర్ తయారీ అంశంపై చర్చించారు. విశాఖపట్నానికి ఈ రహదారి చాలా ఉపయోగమని, విశాఖపట్నం పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వెళ్లే సరుకు రవాణా వాహనాలకు తక్కువ దూరం అవుతుందని కేంద్రమంత్రికి జగన్ తెలిపారు. పరిశీలిస్తామని కేంద్రమంత్రి గడ్కరీ జగన్‌కు హామీ ఇచ్చారు.
Also Read: మరో జీవోను వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం ...సర్పంచ్‌ల అధికారాలు సేఫ్ !
విశాఖ నగరంలో వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 6 లేన్ల రహదారిని మంజూరు చేయాలని సీఎం జగన్ కోరారు ఇరువరి మధ్య భేటీ దాదాపుగా గంట సేపు సాగింది. ఆ తర్వాత కేంద్ర సమాచార, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో సీఎం జగన్ భేటీ అరగంట పాటు కొనసాగింది. సమావేశంలో ఏపీలో క్రీడా మైదానాల అభివృద్ధి సహా పలు అంశాలపై చర్చించారు. అనంతరం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు. ఏపీలో నవోదయ పాఠశాలల ఏర్పాటుపై కేంద్రమంత్రితో చర్చించారు. కేంద్ర విద్యా సంస్థలకు బడ్జెట్ లో నిధులు, నూతన విద్యా విధానం అమలుపై చర్చించారు.
Also Read: చెత్తపన్ను కట్టకపోతే ఇంటి ముందే చెత్త పోస్తారట... వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే హెచ్చరిక !
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కావాలనుకున్నప్పటికీ ఆయన అందుబాటులో లేకపోవడంతో సమావేశం కాకుండానే అమరావతికి వచ్చేశారు. మొదట అపాయింట్ మెంట్ ఖరారైందన్న ప్రచారం జరిగింది కానీ చివరికి అది నిజం కాదని తెలిసింది. ప్రభుత్వం తరపున పెండింగ్‌లో ఉన్న అంశాలన్నింటినీ పరిష్కరించాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం సత్వరం స్పందిస్తుందని ... సమస్యలను పరిష్కరిస్తుందని కేంద్రం ఎదురు చూస్తోంది. సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన ఆయన సాయంత్రం నాలుగు గంటల సమయంలో ప్రధానిని కలిశారు . ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ భేటీ అయ్యారు.
Also Read: అమరావతి కార్పొరేషన్ దేని కోసం ? అభివృధ్ది కోసమా ? రాజకీయం కోసమా ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి