Dharmana : చెత్తపన్ను కట్టకపోతే ఇంటి ముందే చెత్త పోస్తారట... వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే హెచ్చరిక !
చెత్త పన్ను కట్టని వారింటి ముందు చెత్త వేస్తామని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. పథకాలన్నీంటికీ డబ్బులు తీసుకుంటూ.. పన్ను కట్టమంటే కట్టరా అని ప్రజలపై ఆయన మండిపడ్డారు
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అసహనం ప్రజల మీద ఆగ్రహం రూపంలో బయటకు వస్తోంది. కొద్ది రోజులుగా చెత్త పన్ను అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రజలు ఈ పన్ను విషయంలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి శ్రీకాకుళంలోనూ ఉంది. శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఉన్న ధర్మాన ప్రసాదరావుకు కూడా ఈ చెత్తపన్ను సెగ తగలింది. దీంతో ఆయన ఒక్కసారిగా ప్రజలపై ఫైరయ్యారు
100 రూపాయలు చెత్త పన్ను వసూలు చేస్తే రాద్దాంతం దేనికని ప్రశ్నించారు. రూ. వంద పన్ను వసూలులో పెద్ద విషయం ఏముందని ప్రశ్నించారు . ప్రభుత్వం చేయాల్సింది అంతా చేస్తోందని గుర్తు చేశారు. అంతా కాదు పన్ను పన్ను కట్టని వారి చెత్త తీసుకెళ్ళబోమని వారి ఇంటి ముందే పోసేస్తామని కూడా ఎమ్మెల్యే ధర్మాన హెచ్చరించారు. ఇంటి ముందు చెత్త పోసిన తర్వాత అనుభవించండి తెలుస్తుందని కూడా శాపనార్థాలుపెట్టారు. పది పధకాలకు ప్రభుత్వం డబ్బులు పంచాలి..కానీ మనం డబ్బులు కట్టము అంటే ఎలా అని ప్రజల్ని మండిపడ్డారు. సచివాలయ సిబ్బంది, అధికారులు , నాయకులు చెత్త పన్ను కట్టించే దిశగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
Also Read: బిల్లులు రాక వైఎస్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు.. ప్రభుత్వంపై ధర్మాన ప్రసాదరావు అసంతృప్తి !
ఎమ్మెల్యే మాటలు విని అక్కడి ప్రజలు అవాక్కయ్యారు. పన్ను విషయంలో ప్రజల బాధలు అర్థం చేసుకుంటారేమోనని వారు అనుకున్నారు. కానీ రివర్స్‌లో ఆయన ప్రజల్నే విమర్శించడంతో ఏం చేయాలో వారికీ అర్థం కాలేదు. అందుకే సైలెంట్‌గా ఉండిపోయారు. పైగా ముక్కు పిండి చెత్త పన్ను వసూలు చేయాలని అక్కడే అధికారుల్ని ఆదేశించడంతో ఇక తప్పదని వారు కూడా ఫిక్సయిపోయారు.
కొద్ది రోజుల క్రితం బ్యాంకులు చిరు వ్యాపారులకు రూ. పదివేల హామీ లేని రుణం ఇవ్వడం లేదని కొన్ని చోట్ల బ్యాంకుల ముందు చెత్త పోశారు. ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అలా బ్యాంకుల ముందు మున్సిపల్ వర్కర్క్ చెత్త పోశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన గుర్తుకు వచ్చిన వారంతా చెత్తపన్ను కట్టకపోతే తమ ఇంటి ముందు చెత్త పోసినా పోస్తారన్న ఆందోళనకు గురవుకుంండా ఉంటారా ?