Srikakulam: వంశధార ప్రాజెక్టుకు మోక్షమెప్పుడు... 60 ఏళ్ల సమస్యకు ఎవర్ని నిందించాలి... ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కామెంట్స్
వంశధార ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఏపీ, ఒడిశా ఇరు రాష్ట్రాల రైతులకు ఉపయోగకరమని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. 60 ఏళ్ల క్రితం ప్రారంభమైన వంశధార ప్రాజెక్టు నేటికీ పూర్తికాలేదన్నారు.
వంశధార ప్రాజెక్టు నిర్మాణం శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని మాజీమంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా కాలంగా సరిహద్దు రాష్ట్రం ఒడిశాతో వివాదం నడుస్తూనే ఉందని, ఆ సమస్యను పరిష్కరించేందుకు సీఎం జగన్ 9వ తేదీన ఒడిశా వెళ్తున్నారన్నారు. ఇగోలకు పోకుండా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరిపేందుకు ముందడుగు వేసిన సీఎం జగన్ ఆలోచనను జిల్లా వాసులు హర్షిస్తున్నారన్నారు. 60 ఏళ్ల క్రితం ప్రారంభమైన వంశధార ప్రాజెక్టు నేటికీ పూర్తి కాలేదంటే కారకులు ఎవరని ప్రశ్నించారు. అదృష్టవశాత్తూ ఒక చొరవ చూపే ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి దొరికారన్నారు. ప్రజల జీవనప్రమాణాలను కాపాడేందుకు సీఎం జగన్ తలపెట్టిన ఈ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుందన్నారు.
Also Read: ఏపీలో మరికొద్ది రోజులు వానలు పడే ఛాన్స్.. 9న మరో అల్పపీడనం, తెలంగాణలో ఇలా..
ఒడిశా రైతులకూ లాభమే..
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ జాతీయ దృక్పథం కలిగిన వ్యక్తి అని, ఒక జాతీయవాదిగా ఒక మంచి నిర్ణయాన్ని నవీన్ పట్నాయక్ తీసుకుంటారని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. వంశధార ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు కాదన్నారు. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కాట్రగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం ఏపీ ప్రభుత్వం నిర్మించాలని, ఈ ప్రాజెక్టు నిర్మిస్తే ఒడిశా రైతులకు కూడా ఉపయోగపడుతుందన్నారు. ఒడిశా ప్రభుత్వం భూములు ఇస్తే పరిహారం చెల్లించడానికి ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. వంశధార ప్రాజెక్టు ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ అని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ బ్యారేజ్ నిర్మాణం పూర్తి అయితే కృష్ణ, గోదావరి జిల్లాల్లో లాగా ఇక్కడ వరి సాగు చేయవచ్చన్నారు.
Also Read: మంత్రి తలసాని శ్రీనివాస్ కుమారుడిపై కేసు.. కారణం ఏంటంటే..
చిన్న సమస్యను పెద్దది చేయడం సరికాదు
వంశధార ప్రాజెక్టు శ్రీకాకుళం ప్రజలకు ఒక వరం అవుతుందని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఇరు రాష్ట్రాల జల ఒప్పందం ప్రకారం 57 టీఎంసీలు ఏపీకి వాటాగా వచ్చిందన్నారు. విశాలమైన ప్రాజెక్టు నిర్మాణానికి పొరుగు రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ అంగీకరించాలని కోరారు. ఒడిశా నీటి వాటా వినియోగం కోసం ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటే ఏపీ ఎలాంటి అభ్యంతరం చెప్పదన్నారు. ఒడిశాలోని ప్రతి పక్షాలు ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. గతంలో సరిహద్దు వివాదాలు సెటిల్ చేసిన కమిటీల షరతులను మరోసారి అధ్యయనం చేస్తే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. చిన్న చిన్న సమస్యలను పెద్దది చేయడం సరికాదన్న ధర్మాన... అందరం భారతీయులం.. అందరం కలిసి కట్టుగా వివాదాలు పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలని కోరారు.
Also Read: కాలుతో తన్నితే.. చక్కగా తన్నించుకుంటారు, వరుసబెట్టి అదే పని.. ఈ వింత ఆచారం ఎందుకో తెలుసా?