Kadapa Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా కారు-లారీ ఢీ.. నలుగురు మృతి
కడప జిల్లాలో రహదారి నెత్తురోడింది. మైదుకూరు-బద్వేలు రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు కర్ణాటక వాసులు మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం అగ్రహారంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ విషాదం ప్రమాదం చోటుచేసుకుంది. టమోటో లోడ్ వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇన్నోవా కారు ఉన్న నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘోర ప్రమాదంలో మృతి చెందిన నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయని, వారికి చికిత్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. ఆ నలుగురికి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కి తరలించినట్లు తెలిపారు. అయితే ప్రమాద బాధితులు కర్ణాటక రాష్ట్రంలోని మొగల్కోట్ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతులు రేష్మ, సద్దాం, సల్మా, భాషలుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరింత వివరాలు దర్యాప్తులో తెలుస్తాయన్నారు.
Also Read: Rishikonda Demolition : కాలగర్భంలోకి విశాఖ రిషికొండ రిసార్ట్.. అక్కడేం కట్టబోతున్నారంటే..?
మైదుకూరు-బద్వేలు రహదారిపై బ్రహ్మంగారిమఠం మండలంలోని అగ్రహారం వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇన్నోవా కారు నుజ్జు నుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న 4 గురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమించడంతో కడప సర్వజన ఆస్పత్రికి తరలించారు. అనంతపురం నుంచి టమోటో లోడ్‌తో విజయవాడ మార్గం వైపు వెళ్తున్న లారీ మైదుకూరు, బద్వేలు రహదారిలో ఎదురుగా వస్తున్న ఇన్నోవా వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
మితిమిరిన వేగమే ప్రమాదానికి కారణం అయ్యి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో స్థానికుల సహాయంతో బయటకు తీశారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు పోలీసులు.