Huzurabad Bypoll: ఏ క్షణమైనా ఉప ఎన్నికల షెడ్యూల్.. మళ్లీ ఆ తప్పు చేయకుండా ఈసీ జాగ్రత్తలు, టెన్షన్‌లో దీదీ!
దేశంలో కరోనా రెండో వేవ్ తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. మూడో వేవ్ వచ్చే లోపే ఉప ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో హుజూరాబాద్ సహా దేశంలో ఖాళీ అయిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలకు ఈసీ సిద్ధమైంది. ఏ క్షణంలో అయినా షెడ్యూల్ విడుదల జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సెప్టెంబరు రెండు లేదా మూడో వారంలో ఖాళీ అయిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
తెలంగాణలో హుజూరాబాద్ సహా ఆంధ్రప్రదేశ్‌లో బద్వేల్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇవి కాక, పశ్చిమ బంగాల్, కర్ణాటక, ఒడిశా, హర్యానా, రాజస్థాన్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాలకు నిర్వహించే ఉప ఎన్నికలతో పాటే రాజ్యసభ స్థానాలు, ఎమ్మెల్సీ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ స్థానాలు ఏపీలో 3 ఉండగా తెలంగాణలో 6 ఎమ్మెల్సీల పదవి కాలం పూర్తయింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడం, అన్ని రాష్ట్రాల్లో కేసులు కూడా స్వల్పంగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. మళ్లీ మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబరు నెలాఖరు లేదా అక్టోబరు నాటికి కరోనా కేసులు తీవ్రంగా నమోదవుతుంటాయని వైద్య నిపుణులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో మూడో వేవ్ వచ్చే లోపే ఉప ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొవిడ్19 మూడో వేవ్ హెచ్చరికల వేళ ఉప ఎన్నికల నిర్వహణ విషయంలో ఈసీ ఆచితూచి వ్యవహరిస్తోంది.
గతంలో కోర్టుల నుంచి విమర్శలు
గతంలో 5 రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సందర్భంగా కొవిడ్ కేసులు పెరగడంతో కోర్టుల నుంచి ఈసీ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, ఎన్నికల నిర్వహణ కాలపరిమితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈసీ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయొచ్చుననే సమాచారంతో ఇప్పటికే తెలంగాణలోని హుజూరాబాద్‌లో రాజకీయ వేడి మొదలైంది.
బెంగాల్‌లో దీదీకి టెన్షన్..
మరోవైపు, ఉప ఎన్నికల షెడ్యూల్ విషయం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని కాస్త కలవరపాటుకు గురి చేస్తోంది. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలపై శనివారం మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని తృణమూల్ కాంగ్రెస్ నేతల బృందం కలవనుంది. బెంగాల్‌లో 7 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని వారు ఈసీని కోరనున్నారు. ఆ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగడం మమతకు అత్యవసరం. ఎందుకంటే, ఆమె గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. నిబంధనల ప్రకారం ఆ సమయం నుంచి 6 నెలల్లోపు అంటే.. నవంబర్ 4లోపు ఉప ఎన్నిక జరిగి ఏదో ఒక స్థానం నుంచి ఆమె గెలవాలి. విజయం సాధిస్తేనే ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. లేదంటే సీఎం కుర్చీ నుంచి దిగిపోవాల్సి ఉంటుంది. అందుకే, టీఎంసీ నేతలు ఉప ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక, వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఇక అక్కడ అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేదు.