PSLV C59: పీఎస్ఎల్వీ - సీ59 ప్రయోగం వాయిదా - ఇస్రో కీలక ప్రకటన
ISRO: బుధవారం సాయంత్రం చేపట్టాల్సిన పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం వాయిదా పడింది. సాంకేతిక కారణాలతో గురువారం సాయంత్రం ఉపగ్రహం లాంచ్ చేస్తామని ఇస్రో ప్రకటించింది.
ISRO Postponed Launching Of PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 (PSLV C59) ప్రయోగం వాయిదా పడింది. శ్రీహరికోటలోని (Sriharikota) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) నుంచి బుధవారం సాయంత్రం 4:08 గంటలకు ప్రయోగం చేపట్టాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ఇస్రో (ISRO) ప్రకటించింది. ఉపగ్రహానికి సంబంధించి కౌంట్ డౌన్ ప్రక్రియ 25:30 గంటల పాటు కొనసాగిన తర్వాత మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి పంపాలని శాస్త్రవేత్తలు భావించారు. అయితే, సాంకేతిక లోపంతో పీఎస్ఎల్‌వీ సీ59 ఉపగ్రహాన్ని గురువారం సాయంత్రం 4:12 గంటలకు నింగిలోకి పంపుతామని ఇస్రో ప్రకటించింది.
Due to an anomaly detected in PROBA-3 spacecraft PSLV-C59/PROBA-3 launch rescheduled to tomorrow at 16:12 hours.
— ISRO (@isro) December 4, 2024
పీఎస్ఎల్‌వీ సీ59 రాకెట్‌ను యూరోపియన్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3 ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లేలా రూపొందించారు. ఈ ప్రయోగం ద్వారా దాదాపు 550 కేజీల బరువున్న శాటిలైట్లను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టబోతున్నారు. రాకెట్ ప్రయోగంలో 4 దశలుండగా.. రాకెట్ సహా మొత్తం 320 టన్నులను నింగిలోకి పంపబోతున్నారు. ఈ ప్రయోగం ద్వారా 61వ పీఎస్ఎల్వీ రాకెట్‌ను ఇస్రో నింగిలోకి పంపబోతోంది. ఈ మిషన్‌లో మొత్తం 2 ఉపగ్రహాలను అమర్చగా.. ఇందులో ఓకల్టర్ శాటిలైట్ (ఓఎస్సీ), కరోనా గ్రాస్ శాటిలైట్ అనే ఉపగ్రహాలున్నాయి. ఈ ప్రయోగం విజయం తర్వాత మరిన్ని విదేశీ ఉపగ్రహాలను మన ద్వారా ప్రయోగించే అవకాశం లభిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ప్రయోగానికి మంగళవారం మధ్యాహ్నం 2:38 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కాగా.. బుధవారం సాయంత్రం ప్రయోగించాల్సి ఉంది. అయితే, సాంకేతిక కారణాలతో గురువారం సాయంత్రం ప్రయోగిస్తామని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.