Maoist Dev Ji: మావోయిస్ట్ అగ్రనేత దేవ్‌జీ సెక్యూరిటీ అంతా దొరికారు - మరి దేవ్‌జీఎక్కడ? పోలీసుల అదుపులో ఉన్నారా?
Devji: మావోయిస్టు దళపతి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ విజయవాడలో పోలీసులకు పట్టుబడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం ఏం చెప్పడం లేదు.

Maoist party leader Devji Where: మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ మంగళవారం తగిలింది. కీలక నాయకుడు హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టులను ఎన్కౌంటర్ లో హతమార్చినట్లుగా ప్రకటించిన పోలీసులు.. ఆ వెంటనే ఏపీ లోని పలు చోట్ల మెరుపు దాడులు చేశారు. విజయవాడ పెనుమలూరులోని ఒక భవనంలో, ఏలూరు లోని ఒక అపార్ట్ మెంట్ లో, కాకినాడలోని ఒక ఇంటివద్ద కూడా గ్రేహౌండ్స్..ఆక్టోపస్ పోలీసులు బృందాలుగా వెళ్లి చుట్టుముట్టి సోదాలు చేశారు..
విజయవాడ పెనుమలూరులోని అద్దె భవనంలో 27 మంది సహా మొత్తం 31 మంది మావోయిస్టులు పట్టుబడ్డారని.. అందులో మహిళలే ఎక్కువగా ఉన్నారని.. ఎక్కువమంది ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు అని ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్డా ప్రకటించారు. పట్టుబడిన వారిలో కీలక నేతలు ఉన్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ తెలిపారు. వీరంతా బడా లీడర్స్ కు రక్షణగా ఉండే ఆర్మీ టీం సభ్యులని కూడా అధికారులు తెలిపారు. దేవ్ జీకి సెక్యూరిటీగా ఉండే వారంతా పట్టుబడ్డారు. అక్కడే మరి దేవ్ జీ ఎక్కడున్నారన్న సందేహం ప్రారంభమయింది. .
పట్టుబడిన కీలక నేతలలో దేవ్ జీ కూడా ఉన్నాడా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు అధికారులు మాత్రం పట్టుబడిన కీలకనేతల పేర్లు వెల్లడించలేదు. దేవ్ జీ కి సంబంధించిన ప్రచారాన్ని కూడా కొట్టిపారేస్తున్నారు. ఇదిలా ఉండగా పౌర హక్కుల సంఘం నాయకులు మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే దేవ్ జీ అరెస్ట్ పై.. ఆంధ్రా తెలంగాణ ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది..
తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ (60) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2025 మేలో చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ అడవుల్లో ఎన్‌కౌంటర్‌లో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయిన తర్వాత స్థానంలో సెప్టెంబర్ 2025లో దేవ్‌జీని కేంద్ర కమిటీ ఎంపిక చేసింది. మావోయిస్టు పాలిట్‌బ్యూరో మెంబర్‌గా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్‌గా పనిచేసిన ఈయన గెరిల్లా యుద్ధ నిపుణుడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)ను సృష్టించడంలో కీలక పాత్ర పోషించాడు. మహారాష్ట్ర, ఒడిషా, చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు రిక్రూట్‌మెంట్, మిలిటరీ ట్రైనింగ్ క్యాంపుల నిర్వహణలో ఈయన ప్రధాన పాత్ర ఉంది.
తిప్పిరి తిరుపతి కొరుట్లకు చెందిన వారు. ఇంటర్మీడియట్‌ను కొరుట్ల గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతూ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్‌ఎస్‌యూ) ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. 1983లో కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో డిగ్రీ చేరిన తర్వాత, ఆర్‌ఎస్‌యూ-ఎబ్‌వీపీ మధ్య ఘర్షణల్లో పాల్గొని పలు పోలీస్ కేసుల్లో చిక్కుకున్నాడు. 1983 నాటికి అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లాడు. అప్పటి నుంచి ఉద్యమంలోనే ఉన్నారు.





















