CROP LOSS: వర్షాలు మిగిల్చిన కష్టం.. ఏపీకి 3వేల కోట్ల రూపాయలకు పైగా పంట నష్టం..
భారీ వర్షాలు, వరుస తుపాన్లకు ఏపీ రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. చేతికొచ్చిన పంటలు నీట మునిగి రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. పంటనష్టం రూ.3,300 కోట్లు అని అంచనా వేశారు అధికారులు.
భారీ వర్షాలు, వరుస తుపాన్లకు ఏపీ తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా నీటిపారుదల రంగానికి అంచనాలకు అందని నష్టం జరిగింది. అన్నమయ్య ప్రాజెక్ట్, పింఛా ప్రాజెక్ట్ కరకట్టలు కొట్టుకుపోయాయి. సోమశిల ప్రాజెక్ట్ ఆప్రాన్ ధ్వంసమైంది. పెన్నా పరివాహక ప్రాంతం తీవ్రంగా కోతకు గురైంది. చెరువులు పూర్తి స్థాయిలో నిండిపోయాయి. ఇరిగేషన్ రంగానికి తీవ్ర నష్టం జరిగినా.. మరో రెండు మూడేళ్ల వరకు.. తాగు, సాగునీటికి కొరత లేదు అనే విషయం ఒక్కటే కాస్త ఊరటనిస్తోంది. అదే సమయంలో అన్నదాతలు మాత్రం పంట పొలాలు నీటమునిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పరిహారం ప్రకటించినా ఈ క్రాప్ నమోదు తప్పనిసరి అనడంతో కొంతమంది రైతులు నిరాశలో ఉన్నారు.
వరితోపాటు, సెనగ, పత్తి, మినుము, మొక్కజొన్న, చెరకు, పొగాకు పంటలకు తీవ్ర నష్టం జరిగింది. నవంబరు నెలలో కురిసిన వానలకు ప్రభుత్వ అంచనాల ప్రకారమే 13 జిల్లాల్లో 13.24 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా నష్టపోయాయి. నష్టం విలువ రూ.3,300 కోట్లు అని తేలింది. జూన్ నుంచి అక్టోబరు వరకు కూడా కుండపోత వానలతో చేతికొచ్చిన పంటలు నీటమునిగాయి. కర్నూలు జిల్లాలో అదే సమయంలో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు నష్టపోయారు. నవంబర్ లో కురిసిన వానలకు మొత్తం సర్వనాశనం అయింది.
నవంబరులో రోజుల వ్యవధిలో ఏర్పడిన రెండు వాయుగుండాల ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు పరిమితం అయినా.. తాజాగా వచ్చిన తుపాను ప్రభావం ఉత్తరాంధ్రని దెబ్బతీసింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని జిల్లాల్లో వరద నష్టం రైతుల్ని నిండా ముంచింది. రాష్ట్రవ్యాప్తంగా 6.10 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిన్నది. సుమారుగా ఎకరానికి రూ.40వేలు పెట్టుబడి పెడతారు రైతులు. వీరిలో కొంతమందికి పంట చేతికొచ్చింది, మిగతా వారికి వెన్ను దశలోనే విరిగిపోయింది. రెండోసారి ఆశతో వరినాటినా అది కూడా వర్షార్పణం అయిందని అంటున్నారు నెల్లూరు, చిత్తూరు జిల్లా రైతులు. వరుసగా వచ్చిన ఉప్పెనలు కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లా రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరిచాయి. తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి.
వరితోపాటు, కడప జిల్లాలో ముఖ్యంగా సెనగ రైతులు అవస్థలు పడ్డారు. ఎకరాకి 10వేల రూపాయల పెట్టుబడితో సెనగను సాగు చేశారు కడప జిల్లా రైతులు. జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో పంటసాగు చేశారు. ఈ క్రాప్ కూడా నమోదు కాకపోవడంతో బీమా సొమ్ము వస్తుందో రాదో అని రైతులు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం విత్తనాలకు మాత్రమే రాయితీ ఇస్తుండటంతో.. రెండోసారి పంట వేస్తే పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడవుతాయని అంటున్నారు రైతులు.
గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో మిరప పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఎకరాకు రూ.70వేల నుంచి రూ.90 వేల వరకు ఖర్చు కాగా.. తెగుళ్ల కారణంగా పురుగుమందులు చల్లుతున్న దశలో పంట వర్షాలకు దెబ్బతిన్నది. ఒక్క అనంతపురం జిల్లాలోనే సుమారు 11వేల ఎకరాల మిరప తోటలు దెబ్బతిన్నాయి. దీంతో తోటల్ని దున్నేస్తున్నారు రైతులు.
మొత్తమ్మీద ఈ ఏడాది ఏపీలో రైతాంగం వర్షాలకు, వరదలకు తీవ్రంగా నష్టపోయింది. గతంలో అనావృష్టితో ఎక్కువగా నష్టపోయే రైతులు.. ఈసారి అతివృష్టి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.
Also Read: విలన్‌గా నటించడానికి బాలకృష్ణ రెడీ! అయితే... ఓ కండీషన్!
Also Read: భీమ్... భీమ్... కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ కొత్త పోస్టర్ చూశారా?
Also Read: రామారావుగా థియేటర్లలోకి రవితేజ వచ్చేది ఎప్పుడంటే?
Also Read: హీరోయిన్‌కు రంగు తెచ్చిన సమస్య... దాన్నుంచి బయట పడటం కోసం!
Also Read: నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయకే ల....' అని వాగక్కర్లేదు - చిన్మయి
Also Read: బైక్ ఫైట్, టార్చర్ సీక్వెన్స్.. 'పుష్ప'లో కేక పెట్టించే సీన్స్ ఇవే..
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి