Andhra Pradesh Night Curfew: ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు... ఆగస్టు 14 వరకు ఆంక్షలు, కఠిన చర్యలకు ఆదేశాలు
ఏపీలో కరోనా వైరస్ విస్తరణ దృష్ట్యా రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు రాత్రి కర్ఫ్యూ పొడిగించింది. ఆగస్టు 14 వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.
ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 14వ తేదీవరకూ కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. అందరూ కొవిడ్-19 ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా వీలైనంత త్వరగా ఉపాధ్యాయులకు టీకాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆగస్టు నెలలో పాఠశాలలు తెరిచే యోచన ఉన్న ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు ఇచ్చింది. మే, జూన్, జులై నెలల్లో ప్రైవేటు ఆస్పత్రులకు 43,38,000 డోసులు విడుదల చేస్తే, కేవలం 5,24,347 మాత్రమే వినియోగించారని, ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వానికి తిరిగి అందిస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా ముందుకు సాగుతుందన్నారు.
ఏపీలో కరోనా కేసులు
రాష్ట్రంలో గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల మధ్య 80,641 పరీక్షలు నిర్వహించగా.. 2,068 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే రాష్ట్రంలోని మొత్తం కరోనా బాధితుల సంఖ్య 19,64,117కు చేరుకుంది. అదే సమయంలో కొవిడ్19 బారిన పడిన మరో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య 13,354కు చేరింది. 2,127 మంది బాధితులు కోలుకున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 49,683 యాక్టివ్ కేసులున్నాయి.
కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లోకి వెళ్తున్న వారు ముఖానికి మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, మాస్కులు లేని వారిని అనుమతిస్తే రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. జరిమానా మొత్తాన్ని అక్కడి పరిస్థితుల ఆధారంగా ఖరారు చేస్తామని స్పష్టం చేసింది. అలాగే 2-3 రోజుల పాటు సంబంధిత సంస్థను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. కొవిడ్19 నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి ఆ ఫొటోలు పంపితే నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. దీని కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నెంబరును ప్రకటించారు.
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. మరోవైపు మాస్కులు ధరించని వారి నుంచి కనీసం రూ.100 జరిమానా విధించే అధికారాన్ని ఎస్‌ఐలతో సహా ఆపై పోలీసు అధికారులకు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకూ ఈ అధికారం వైద్యాధికారులకు మాత్రమే ఉండేది.