Chandrababu In Delhi : డిప్యూటీ స్పీకర్ పదవి అడగలేదు వాళ్లు ఇస్తామనలేదు - ఢిల్లీలో చంద్రబాబు క్లారిటీ
AP CM Delhi Tour : డిప్యూటీ స్పీకర్ పోస్టు తాము అడగలేదు..బీజేపీ ఇస్తామని చెప్పలేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌లో పేర్కొన్నారు.
![Chandrababu In Delhi : డిప్యూటీ స్పీకర్ పదవి అడగలేదు వాళ్లు ఇస్తామనలేదు - ఢిల్లీలో చంద్రబాబు క్లారిటీ Chandrababu said did not ask for Deputy Speaker post chandrababu chit chat Chandrababu In Delhi : డిప్యూటీ స్పీకర్ పదవి అడగలేదు వాళ్లు ఇస్తామనలేదు - ఢిల్లీలో చంద్రబాబు క్లారిటీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/ca50172d73fe49f346d109a1a2331ad21720183423556228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chandrababu ChitChat in Delhi : లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పోస్టును తాము కోరుకోవడం లేదని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీలో రెండు రోజుల పర్యటన పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌కు తిరుగుపయనం అయ్యే సమయంలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా కీలక విషయాలను ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఎలాంటి పదవుల్ని ఆశించడం లేదని స్పష్టం చేసారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్ పోస్టును టీడీపీకి ఇస్తారని జాతీయ రాజకీయవర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటి చర్చలేమీ లేవని చంద్రబాబు చెప్పడంతో ఆ పోస్టుకు టీడీపీ పోటీ పడటం లేదని క్లారిటీ వచ్చేసినట్లయింది.
పదవుల కోసం తాము చూడటం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నందున వారు ఆఫర్ చేసిన రెండు మంత్రి పదవుల్ని తీసుకున్నామన్నారు. వాజ్ పేయి హాయాంలో ఏడు మంత్రి పదవులు ఇస్తామన్నారని.. కానీ అవేమీ వద్దని చెప్పి ఒక్క స్పీకర్ పదవినే తీసుకున్నామని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుతం తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం కానీ పదవుల గురించి కాదని అంటున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తల్ని సంప్రదిస్తూంటే మళ్లీ జగన్ వస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. అయితే డెవిల్ ను నియంత్రించామని ఇక ఎలాంటి సమస్యా రాదని భరోసా ఇస్తున్నామన్నారు.
రేవంత్ రెడ్డితో భేటీలో.. రాష్ట్ర విభజన అంశాలపై సమగ్రంగా చర్చిస్తామని చంద్రబాబు తెలిపారు. నదుల అనుసంధానం కీలకమని చంద్రబాబు అన్నారు. ఒక్క గోదావరి నది నుంచి సుమారు 3000 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని గుర్తు చేశారు. ఆ నీటిని వినియోగించుకోగలిగితే రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించవచ్చునని.. నదుల అనుసంధానం పూర్తిస్థాయిలో చేయగలిగితే గోదావరి నుంచే దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ నీటి సరఫరా చేయవచ్చునని స్పష్టం చేశారు. దావోస్‌లో జరిగే పెట్టుబడుల సదస్సుకు తప్పకుండా హాజరవుతానని ఆయన ప్రకటించారు.
ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యంగా పని చేస్తామని, గత ఐదేళ్ల దుష్పరిణామాల వల్ల రాష్ట్రానికి పూడ్చలేని స్థాయిలో నష్టం వాటిల్లిందన్నారు. ప్రజలు ఎన్డీఏ కూటమికి అధికారం ఇచ్చారని, అందరం కలిసి రాష్ట్రాన్ని బాగు చేస్తామని.... ఆంధ్రప్రదేశ్ ప్రజలను గ్లోబల్ లీడర్లుగా తయారు చేయడం కర్తవ్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు ప్రకటించారు. డిల్లీ పర్యటనలో చంద్రబాబు .. వచ్చే పూర్తి స్థాయి బడ్జెట్‌లో వివిధ శాఖల ద్వారా రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించేలా చూసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)