Chandrababu Macharla: రౌడీయిజం, నేరాలు చేస్తే చెత్త లాగే చెత్త రాజకీయాలనూ క్లీన్ చేస్తాం - మాచర్లలో చంద్రబాబు హెచ్చరిక
Macherla: మాచర్ల వైసీపీ నేతలకు చంద్రబాబు నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. అరాచకాలు చేసిన వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Chandrababu issues direct warnings to Macherla YCP leaders: గతంలో మాచర్లలో చాలా అరాచకాలు చేశారు. వారందరికీ జాగ్రత్తగా ఉండాలని పల్నాడు గడ్డ పై నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరికలు జారీ చేశారు. మాచర్లలో ప్రజావేదిక కార్యక్రమంలో మాట్లాడారు. రౌడీయిజం, నేరాలు, ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోనని కఠినంగా హెచ్చరించారు. మాచర్లలో గతంలో ప్రజాస్వామ్యం లేకపోవడం, అరాచకాలు జరగడం వంటి సమస్యలు ఉండేవని, ఇప్పుడు ఎవరైనా స్వేచ్ఛగా జీవించే పరిస్థితులు వచ్చాయన్నారు. రాయలసీమలో ముఠాలను తొలగించినట్లుగా, పల్నాడులో రౌడీయిజం అంతు చూస్తామన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడతామని భరోసా ఇచ్చారు.
'సూపర్ సిక్స్' పథకాల అమలు చేస్తున్నామని ఒకేసారి రూ.12 వేల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేశామని గుర్తు చేశారు. ఆడబిడ్డల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. "విద్యార్థినులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. అందరు పిల్లలకు 'తల్లికి వందనం' అమలు చేశాం. రైతులకు 'అన్నదాత సుఖీభవ' ద్వారా ఆదుకుంటున్నాం" అని పేర్కొన్నారు. పింఛన్ల రూపంలో ఏడాదికి రూ.34 వేల కోట్లు విడుదల చేస్తున్నామని, డీఎస్సీ ద్వారా 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని, మున్ముందు 10 లక్షల ఉద్యోగాలు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనటానికి మాచర్ల వచ్చా..
— Kanna Lakshmi Narayana (@KLNTDP) September 20, 2025
చెత్తను తొలగించటంతో పాటు, ఇక్కడ ఉండే చెత్త రాజకీయాలను కూడా తొలగిస్తా.. #SwarnaAndhraSwachhAndhra#MyCleanAP#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/GWh0zuaghE
పేదరికం లేని సమాజ నిర్మాణమే మా ధ్యేయమని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నందున జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు నిజమైన దసరా, దీపావళి వచ్చాయని, నిత్యవసర వస్తువుల ధరలు తగ్గుతాయన్నారు. "చెత్త తీస్తేనే సరిపోదు.. మనసుల్లో చెత్తను కూడా పూర్తిగా తొలగించాలి" అని అన్నారు. గత వైకాపా ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను రోడ్లపై వేసి, దానిపై పన్ను విధించిందని ఆరోపించారు. మేం అధికారంలోకి రాగానే పన్ను తొలగించామని, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా 'లెగసీ వేస్ట్' పూర్తిగా తొలగిస్తామని ప్రకటించారు. స్వచ్ఛ వాహనాలు ప్రజల ఇంటికి వచ్చి, పాత వస్తువులు తీసుకుని నిత్యవసరాలు అందిస్తామని తెలిపారు.
ప్లాస్టిక్ వాడకం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, రాష్ట్రాన్ని 'ప్లాస్టిక్ ఫ్రీ'గా మార్చుతామని చెప్పారు. "చెత్త తొలగించడంతో పాటు చెత్త రాజకీయాలనూ క్లీన్ చేస్తాం" అని కట్టుబాటు పని చేస్తామని ప్రకటించారు. 2047 నాటికి రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం ఉండేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని పిలుపునిచ్చారు."నా లక్ష్యం ఒక్కటే.. అందరికీ ఆదాయం పెరగాలి" అని చంద్రబాబు చెప్పారు. 'వాట్సాప్ గవర్నెన్స్' ద్వారా పనులు వెంటనే పూర్తవుతాయని, 730 సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. త్వరలో 'సంజీవని' కార్యక్రమం ప్రవేశపెట్టి, అందరికీ రూ.2.5 లక్షల బీమా, పేదలకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా అందిస్తామని ప్రకటించారు. ఇంటి వద్దే వైద్యం అందేలా చూస్తామన్నారు.
పోలవరం ప్రాజెక్ట్‌ను 2027 కల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. మాచర్లకు సమీపంలో నాగార్జున సాగర్ ఉన్నప్పటికీ తాగునీరు సమస్యగా ఉందని, నదుల అనుసంధానం ద్వారా అందరికీ సాగు, తాగునీరు అందిస్తామని తెలిపారు. ఈ ఏడాది 94 శాతం ప్రాజెక్టుల్లో జలకళ కనిపిస్తోందని, కేంద్రంతో మాట్లాడి 'మిర్చి బోర్డు' తీసుకురావడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. వ్యవసాయంలో పురుగు మందుల వాడకం తగ్గించాలని సూచించారు. మాచర్లకు 100 పడకల ఆసుపత్రి మంజూరు చేస్తున్నామని, ఇతర నియోజకవర్గాల్లో కూడా ఆస్పత్రుల ఏర్పాటుపై దృష్టి సారిస్తామని ప్రకటించారు. పల్నాడు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.





















