Jammalamadugu TDP : జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థిగా భూపేష్ - సీఎం జగన్ రాయలసీమ గొంతు కోశారని చంద్రబాబు ఆరోపణలు !
జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డిని చంద్రబాబు ప్రకటించారు. ఆయన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుడి కుమారుడు.
Jammalamadugu TDP : రాయలసీమలో నిర్మాణం ఆగిపోయిన ప్రాజెక్టుల సందర్శనకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా జమ్మలమడుగులో రోడ్ షో నిర్వహించారు. కోవెలకుంట రోడ్డు నుండి పాత బస్టాండ్ వరకు నియోజకవర్గ భూపేష్ రెడ్డితో కలిసి నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహించారు. ప్రజలు టిడిపి కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. అంతకుముందు కోవెలకుంట రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్‌లో టిడిపి ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. అక్కడ భూపేష్ రెడ్డిని టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు.
భూపేష్ ప్రజల కోసం పని చేస్తాడని చంద్రబాబు హామీ
ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దబేరిని నంద్యాల జిల్లా నందికొట్కూరు నుంచి శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం వరకు 10 రోజులు 2500 కిలోమీటర్లు యుద్ధభేరి ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు. జమ్మలమడుగులో భూపేష్ రెడ్డి రానున్న ఎన్నికల్లో టీడీపీని రెపరెపలాడిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. భూపేష్ మీకోసం పనిచేస్తాడని తెలిపారు. ఇక్కడ ఎమ్మెల్యే ఆయన కోసం పని చేస్తాడని.. వచ్చే ఎన్నికల్లో ఎవరు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే చివరకు చికెన్ కోట్టులో కూడా వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు. జమ్మలమడుగు టిడిపికి కంచుకోటని చేనేత కార్మికులు, అనేక వర్గాల వారు టిడిపి కోసం ఇక్కడ పనిచేశారన్నారు. తాను జమ్మలమడుగుకు సాగు నీరు ప్రాజెక్టుల కోసం రావడం జరిగిందన్నారు. జమ్మలమడుగు ఇసుక ఇతర నగరాలైన హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుకు తరలిపోతుందని, అలాగే నాసిరకం మందులు అధిక ధరలకు అమ్మి వచ్చిన కలెక్షన్ అంతా తాడేపల్లికి పోతుందన్నారు.
భూపేష్ రెడ్డిని గెలిపించాలని కోరిన చంద్రబాబు
సీమ ప్రాజెక్టుల కోసం పన్నెండు వేల కోట్ల మేర పనులు చేస్తే జగన్ ముష్టి రెండు కోట్లే ఖర్చు చేశాడన్నారు. మీ చేతిలో ఓటు అనే ఆయుధం ఉందని 2024 ఎన్నికలలో మీ పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డల కోసం మహాశక్తి కార్యక్రమం తీసుకువచ్చానని అందులో అమ్మకు వందనం ద్వారా ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15 వేలు, ప్రతి ఆడ బిడ్డకు నెలకు 15 వందలు ఇస్తానని, బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 2024లో భూపేష్ రెడ్డిని గెలిపించి జమ్మలమడుగు అభివృద్ధికి కారకులు కావాలన్నారు. ప్రతి నిరుద్యోగ యువతకు ఉపాధి కలిపిస్తానని, రైతుతో పాటు అందరినీ అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు.
బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి దగ్గర బంధువు భూపేష్ రెడ్డి
గత ఎన్నికల తర్వాత ఆదినారాయణరెడ్డి అప్పట్లో టీడీపీకి గుడ్ బై చెప్పారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కాకుండా కడప జిల్లా ఎంపీగా పోటీచేసి ఘోర పరాజయం పాలయ్యారు. పైగా టీడీపీ అధికారంలోకి రాకపోవడం, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆదినారాయణ రెడ్డిపైనా వైసీపీ నాయకులు ఆరోపణలు రావడంతో సైకిల్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన సోదరుడు మాత్రం సైకిల్ పార్టీనే నమ్ముకుని ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి కూడా తన రాజకీయ వారసుడిగా తన అన్న కుమారుడు భూపేష్ రెడ్డినే ప్రకటించారు. అందుకే రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేయాలని విస్తృతంగా జనాల్లో తిరుగుతున్నారు. ఇప్పుడు ఆయనకే చంద్రబాబు అభ్యర్థిత్వం ఇచ్చారు.