Andhra Pradesh: ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
C RamChandraiah Elected As MLC | ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సి. రామచంద్రయ్య, జనసేన నేత పి హరి ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని రిటర్నింగ్ అధికారి తెలిపారు.
New MLCs in Andhra Pradesh | అమరావతి: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కూటమి అభ్యర్థులు ఏకగీవ్రంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. టీడీపీ నేత ఏపీ ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, జనసేన నేత పి. హరి ప్రసాద్ ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం ఈ ఇద్దరే నామినేషన్లు వేయడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ప్రకటించారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్డీయే కూటమి నాలుగు రోజుల కిందట అభ్యర్థుల్ని ఖరారు చేసింది. టీడీపీ నుంచి ఒకరికి, జనసేన నుంచి ఒకరికి అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నేత సి. రామచంద్రయ్యకు, జనసేన నుంచి పి హరిప్రసాద్ పేర్లు ఖరారు చేశారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ అని తెలిసిందే. జులై 2న సి. రామచంద్రయ్య, పిడుగు హరి ప్రసాద్‌లు కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు.
నేటితో ముగిసిన నామినేషన్ల ఉపంసహరణ
రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం (CEC) జూన్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ క్రమంలో జూన్ 25న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. జులై 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ ఉండగా, అదే రోజు కూటమి తరఫున టీడీపీ నేత రామచంద్రయ్య, జనసేన నేత హరి ప్రసాద్‌లు నామినేషన్ వేశారు. జులై 3న ఎన్నికల అధికారులు అభ్యర్థుల ఆ నామినేషన్లను పరిశీలించారు. జులై 5 వరకు నామినేషన్లను ఉపసంహరణకు ఛాన్స్ ఇచ్చారు. అయితే కేవలం ఇద్దరు అభ్యర్థులే పోటీలో ఉండటంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఒకవేళ మరిన్ని నామినేషన్లు వచ్చింటే, ఎన్నికల అధికారులు ఈ 12న ఎన్నికల నిర్వహించి, ఫలితాలను ప్రకటించాల్సి వచ్చేది.
టీడీపీలో చేరిన ఇక్బాల్, రామచంద్రయ్య
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన రామచంద్రయ్య, ఇక్బాల్ టీడీపీలో చేరడం తెలిసిందే. ఫిరాయింపు నేతలపై వైసీపీ నేతల ఫిర్యాదుతో శాసనమండలి చైర్మన్ రామచంద్రయ్యపై, మరో ఎమ్మెల్సీ ఇక్బాల్ పై అనర్హత వేటు వేశారు. దాంతో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక అనివార్యమైంది. కూటమికి భారీగా ఎమ్మెల్యే సీట్లు ఉండటం, మరోవైపు వైసీపీకి ప్రతిపక్ష హోదా రావాల్సిన కోటా ఎమ్మెల్యేలు కూడా రాకపోవడంతో వాళ్లు నామినేషన్ వేయలేదు. దాంతో అనుకున్నట్లుగానే రెండు ఎమ్మెల్సీ స్థానాల్ని కూటమి నేతలు దక్కించుకున్నారు.