Badvel Bypoll: బద్వేలు ఉప ఎన్నిక బరిలో నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే..
ఉపఎన్నికల షెడ్యూల్ రానేవచ్చింది. ప్రధాన పార్టీలు రంగంలోకి దిగనున్నాయి. కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నికల్లో పోటికి టీడీపీ అభ్యర్థిని ప్రకటించగా.. వైసీపీ అభ్యర్థిపై ఇంకా స్పష్టత రాలేదు.
![Badvel Bypoll: బద్వేలు ఉప ఎన్నిక బరిలో నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే.. Badvel bypoll on Oct. 30; YSRCP, TDP announce candidates Badvel Bypoll: బద్వేలు ఉప ఎన్నిక బరిలో నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/25/923899c9a97b7e06732ae52e47a68261_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దేశవ్యాప్తంగా మూడు లోక్‌సభ, ముప్పై శాసనసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేలు (ఎస్సీ) అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక జరగనుంది. అక్టోబర్ 1 న ఈ మేరకు నోటిఫికేషన్ జారీ కానుంది. అక్టోబర్ నెల 8 తేదీ నామినేషన్ల ప్రక్రియకు చివరి తేదీగా నిర్ణయించారు. 11న నామినేషన్ల పరిశీలన ఉండగా 13న ఉపసంహరణకు గడువు నిర్ణయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చి 28 న మృతి చెందారు. ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ వెంకటసుబ్బయ్య బద్వేలు ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి పోటీచేసి ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఓబుళాపురం రాజశేఖర్‌పై 44,834 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. డాక్టర్ వెంకటసుబ్బయ్యకు 95,482 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థికి 50,748 ఓట్లు వచ్చాయి.
వైసీపీ అభ్యర్థిగా దాసరి సుధ
బద్వేలు బరిలో నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్థులను ఆయా పార్టీల అధిష్టానాలు దాదాపు పూర్తి చేశాయి. అయితే వైసీపీ అభ్యర్థిపై ఇంకా స్పష్టత రాకపోయినా.. వెంకటసుబ్బయ్య భార్య దాసరి సుధనే అభ్యర్థిగా ప్రకటిస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆమె దాదాపు ఖాయమైనట్లు అంటున్నారు. 2014 నుంచి తన భర్త అయిన దివంగత ఎమ్మెల్యే డాక్టర్‌వెంకటసుబ్బయ్యతో పాటు ఆమె కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తారని తెలుస్తోంది.
టీడీపీ అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర్
బద్వేలు టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్‌ను ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని టీడీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి ప్రకటించారు. కలసపాడు మండలం చెన్నారెడ్డిపల్లెకు చెందిన రాజశేఖర్ ఎంబీబీఎస్‌తోపాటు ఆర్థోపెడిక్‌లో ఎంఎస్ చేశారు. బద్వేలు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి గత సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెంకట సుబ్బయ్య చేతిలో ఓటమి పాలయ్యారు.
బద్వేలు పరిధిలోని బద్వేలు, గోపవరం, అట్లూరు, బి.కోడూరు, పోరుమామిళ్ల, కాశినాయన, కలసపాడు మండలాల పరిధిలో 272 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. పాత జాబితా ప్రకారం.. 1,06,650 మంది పురుష ఓటర్లు ఉండగా.. 1,06,069 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. తాజాగా కొత్త ఓటర్ల జాబితా వెలువడనుంది. ఆమేరకు ఉప ఎన్నిక జరగనుంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also Read: By Elecctions EC : ఉపఎన్నికలపై హఠాత్తుగా మనసు మార్చుకున్న ఈసీ ! తెర వెనుక ఏం జరిగింది ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)