Diwedi On Counting: ప్రశాంతంగా కొనసాగుతున్న పరిషత్ కౌంటింగ్... ఆరు చోట్ల బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయి... రీపోల్ పై ఎస్ఈసీదే తుది నిర్ణయమన్న గోపాలకృష్ణ ద్వివేది
పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతోందని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. పలు కారణాలతో 6 చోట్ల బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 515 జడ్పీటీసీ,7220 ఎంపీటీసీ స్థానాల్లో కౌంటింగ్ జరుగుతోందని వెల్లండించారు. వివిధ కారణాలతో 6 చోట్ల బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయనిన్నారు. రెండు చోట్ల బ్యాలెట్ పేపర్లకు చెదలు పట్టాయని స్పష్టం చేశారు. నాలుగు చోట్ల తడిచిపోయాయని తెలిపారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల, బీజత్ పురం, శ్రీకాకుళం జిల్లాలో సొరబుచ్చి మండలం షలాంత్రిలో బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయని ద్వివేది తెలిపారు.
కలెక్టర్, రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయం
విశాఖ జిల్లాలో ముక్కవారిపాలెం మండలం తూటిపల్ల, పాపయ్యపాలెంలో బ్యాలెట్లు తడిసిపోయాయని గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. బ్యాలెట్ పేపర్ల వాలిడేషన్ పై కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఎక్కడైనా రీపోల్ అవసరమనుకుంటే ఎస్ఈసీ తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. చిన్న ఘటనలు మినహా కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని ప్రకటించారు. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు త్వరగా వెలువడతాయని, జడ్పీటీసీ ఫలితాలు సాయంత్రం లేదా రాత్రికి వస్తాయని గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు.
నాలుగు నెలల ముందు ఎన్నికలు
ఏప్రిల్ 8వ తేదీన పరిషత్ ఎన్నికలు జరిగాయి. పోలింగ్ తర్వాత కోర్టు ఆదేశాలతో ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఈ ఎన్నికలు జరగడంతో వీటిని రద్దు చేసి మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ఎస్ఈసీ అప్పీల్ చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ కేసును విచారించింది. చివరకు సెప్టెంబర్ 16న ఓట్లు లెక్కించి, ఫలితాలు వెల్లడించవచ్చని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also Read: ZPTC MPTC Results Live Updates: ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు
Also Read: AP ZPTC MPTC Results: కొనసాగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్... బ్యాలెట్ పేపర్లకు చెదలు, బాక్సుల్లో నీరు...