ZPTC MPTC Results Live Updates: వైసీపీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది.. ఈ ఫలితాలే నిదర్శనం: పెద్దిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల తాజా అప్ డేట్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
కాసేపట్లో ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. 958 హాళ్లలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాటుచేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు వచ్చే ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ ఆదేశించారు. కరోనా నెగెటివ్, రెండు డోసుల వ్యాక్సినేషన్ పత్రం తీసుకొచ్చినవాళ్లకే అనుమతి ఇవ్వాలని ఆదేశించారు.
ఎన్టీఆర్ సొంత గ్రామం నిమ్మకూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపు
మాజీ సీఎం, దివంగత నేత ఎన్టీఆర్ సొంత గ్రామం నిమ్మకూరులో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి 8 ఓట్ల తేడాతో విజయం సాధించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి దత్తత తీసుకున్న గ్రామం నిమ్మకూరు కావడం విశేషం. అక్కడ అధికార పార్టీ అభ్యర్థి గెలుపొందారు.
వైసీపీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలే నిదర్శనం: పెద్దిరెడ్డి
వైసీపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తుందనడానికి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతి మారుతినగర్ లోని తన నివాసంలో మీడియాతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. కుట్రపూరితంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేయాలని చూశారని,ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక సామాజిక వర్గానికి కొమ్ముకాయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. కరోనాను బూచిగా చూపించి ఎన్నికలు ఆపేందుకు యత్నించారన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వైసీపీ వైపే ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు జగన్ పాలనపై నమ్మకం ఏర్పడిందన్నారు. చంద్రబాబు, లోకేష్ లకు కరోనా అంటే భయమని.. నారా లోకేష్‌ను రాజకీయాలకు పనికి రాకుండా చేసిన వ్యక్తి చంద్రబాబే అని, తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.
సీఎం జగన్ ఉన్న చోట వైసీపీకి షాకింగ్ రిజల్ట్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటున్న మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి దిమ్మతిరిగే రిజల్ట్ వచ్చింది. ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డికి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు షాక్ ఇచ్చారు. పోటీ చేసిన 18 స్థానాల్లో కేవలం 7 చోట్ల మాత్రమే వైసీపీ విజయం సాధించింది. అందులో 2 చోట్ల టీడీపీ అభ్యర్థులను ఎన్నికలకు ముందే కొనుగోలు చేశారు. దుగ్గిరాల మండలంలో పోటీ చేసిన 14 స్థానాల్లో 9 చోట్ల టీడీపీ ఘన విజయం సాధించింది. భారీ మెజారిటీలతో వైసీపీ అభ్యర్థులపై టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జనసేన రెండు చోట్ల గెలిచింది.
రక్తం కక్కుకొని యువకుడు మృతి
వరంగల్ నర్సంపేట పట్టణం అంబేడ్కర్ సెంటర్‌లోని రాయల్ ఫుడ్ కోర్ట్ బిర్యానీ పాయింట్‌లో బిర్యానీ తిని ఓ యువకుడు బయటికి వచ్చి రక్తం కక్కుకొని చనిపోయాడు. యువకుడిది చెన్నారావుపేట మండలం జల్లి గ్రామం బోడ తండాలోని బోడ ప్రసాద్ (23) గా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఫుడ్ పాయిజన్ అయ్యిందా.. లేక ఇంకా వేరే ఏమన్నా కారణమా? అని విచారణ జరుపుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖపట్నం జిల్లా దిబ్బపాలెంలో వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు సమానంగా ఓట్లు.. విజయం ఎవరిదంటే..!
విశాఖపట్నం జిల్లా దిబ్బపాలెంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులకు ఓట్లు సమానంగా పోలయ్యాయి. దీంతో అధికారులు లాటరీ డ్రా తీయగా.. టీడీపీ అభ్యర్థిని విజయం వరించింది.