(Source: ECI/ABP News/ABP Majha)
GPS Bill: జీపీఎస్ బిల్లులో మరోసారి ఏపీ ప్రభుత్వం మార్పులు
GPS Bill: గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) బిల్లులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి మార్పులు చేసింది. లోపాలను సవరిస్తూ బిల్లును మరోమారు కేబినెట్ ఆమోదానికి పంపించింది.
GPS Bill: గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) బిల్లులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి మార్పులు చేసింది. లోపాలను సవరిస్తూ బిల్లును మరోమారు కేబినెట్ ఆమోదానికి పంపించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా ఈ-ఫైల్ ద్వారా బిల్లును మంత్రులకు సర్క్యులేట్ చేసింది. జీపీఎస్‌లో ప్రతిపాదించిన పెన్షన్ టాప్ అప్‌పై నెలకొన్న సందిగ్ధతను తొలగిస్తూ ప్రతిపాదనలు చేసింది. ఫ్యామిలీ పెన్షన్, మినిమమ్ పెన్షన్ ఎలా ఇవ్వాలన్న దానిపై బిల్లులో మార్పులు చేర్పులు చేసింది. జీపీఎస్ బిల్లులో తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనలు ఆమోదించి పంపాలని మంత్రులకు ప్రభుత్వం సూచించింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులు జీపీఎస్‌లోనే కొనసాగేలా నిర్దేశిత గడువు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది.
ఇటీవల సీఎం జగన్ అధ్యక్షత జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే దాంట్లో కొన్ని అంశాలకు మార్పులు చేస్తూ, లోపాలను సవరిస్తూ బిల్లును మరోసారి కేబినెట్ ఆమోదానికి పంపింది. జీపీఎస్ ముసాయిదా బిల్లును కేబినెట్ లో మంత్రులు ఆమోదం తెలిపాక దీన్ని రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. జీపీఎస్ లో ప్రతిపాదించిన పెన్షన్ టాప్ అప్ కొత్త ప్రతిపాదనలు ఈ బిల్లులో ప్రభుత్వం పెట్టింది. అలాగే యాన్యుటీ తగ్గితే ఫ్యామిలీ పెన్షన్, మినిమమ్ పెన్షన్ ఎలా ఇవ్వాలన్న దానిపై బిల్లులో మార్పులు చేర్పులు చేశారు. సీపీఎస్ ఉద్యోగులు జీపీఎస్ కు మారేందుకు కొంత సమయం ఇవ్వాలని కూడా ప్రతిపాదిస్తున్నారు. తద్వారా ఉద్యోగుల్లో జీపీఎస్ పై ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తెస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అయితే సాంకేతిక కారణాలతో సీపీఎస్ ను రద్దు చేయలేకపోవడంతో ప్రత్యామ్నాయంగా జీపీఎస్ ను అమల్లోకి తెచ్చారు. ఈ పథకం ద్వారా గ్యారంటీగా పెన్షన్ అందుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఉద్యోగి రిటైర్డ్ అయిన సమయానికి ఇంటి స్థలం లేనివారికి కచ్చితంగా ఇంటి స్థలం ఉండాలని సీఎం జగన్ అన్నారు. ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలన్నారు. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్ అయ్యేలా చూడాలని సూచించారు. వారి పిల్లల చదువులు కూడా ఫీజు రియింబర్స్ మెంట్ కింద ఉండి ప్రయోజనాలు అందేలా చూడాలన్నారు.
ఉద్యోగుల అసంతృప్తి
మరోవైపు ఉద్యోగులు మాత్రం జీపీఎస్ బిల్లుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. తమ వాదనలు వినిపించుకోకుండా ప్రభుత్వం మొండిగా జీపీఎస్ బిల్లు తెస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే దీనిపై వివిధ రూపాల్లో నిరసనలు తెలిపినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. సీపీఎస్ రద్దు విషయంలో ఇంతకు మించి చేయలేమని.. సీపీఎస్ ఉద్యోగులు అర్థం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. జీపీఎస్ విధానంలో ఏమైనా చెప్పదల్చుకుంటే మేం చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. జీపీఎస్‌తో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని చెబుతోంది. సీపీఎస్ రద్దు చేశామని, కాబట్టి ఉద్యోగులు అర్ధం చేసుకుంటారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.