CM Chandrababu: ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ - వారికే తొలి ప్రాధాన్యం, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
Andhra News: జూన్‌లోపు అన్ని నామినేటెడ్ పదవుల భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికంటే.. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

AP CM Chandrababu Teleconference With Party Leaders: ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇంఛార్జీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. నామినేటెడ్ పదవుల భర్తీ, అభ్యర్థుల ఎంపికపై దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా నేతలు, మంత్రుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. జూన్‌లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి కంటే.. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలని సూచించారు. ఐదేళ్ల కాలంలో ఇబ్బందులు పడ్డ వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని.. తొలి నుంచి పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయని.. రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు.
రెండేళ్ల పనితీరుపై సమీక్ష
పదవి పొందిన వారి రెండేళ్ల పనితీరుపై సమీక్ష చేస్తామని.. దాని ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయని సీఎం చంద్రబాబు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవి ఆశిస్తున్న వాళ్లు క్యూబ్స్ (క్లస్టర్, యూనిట్, బూత్ సెక్షన్) విభాగాల్లో సభ్యులుగా ఉండాలన్నారు. కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పని తీరు వంటి అంశాలపై ఇందులో చర్చించారు.
2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని తేల్చిచెప్పారు. 7 నెలల కాలంలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపట్టామన్న చంద్రబాబు.. ఈ విషయాలను నిరంతరం ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తామని.. ఈ విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని నేతలకు సూచించారు. మెంబర్ షిప్ బాగా చేసిన వారికి పదవుల్లో ప్రోత్సాహం ఇస్తామన్నారు.





















