AP Postal Ballot Voting: ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులు సస్పెండ్, ఆపై కఠిన చర్యలు: ముఖేష్ కుమార్ మీనా వార్నింగ్
Andhra Pradesh Elections 2024: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు మే 8న చివరి అవకాశం ఇవ్వగా, ఎవరైనా ప్రలోభాలకు గురయితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సస్పెండ్ చేస్తామన్నారు ముఖేష్ కుమార్ మీనా.
AP CEO Mukesh Kumar Meena | అమరావతి: ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే పోస్టల్ బ్యాలెట్ కోసం 4.30 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటి వరకూ 3.03 లక్షల (70%) మంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంగవారం ఆయన మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ కు సంబందించిన విషయాలు వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో మే 3న, మరికొన్ని జిల్లాల్లో మే 4న హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాట్లకు సంబంధించి సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. ఈ 5 వ తేదీన విజయనగరం జిల్లాల్లో తాను పర్యటించి పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ పరిశీలించినట్లు గుర్తుచేశారు.
ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు
పోస్టల్ బ్యాలెట్ విషయంలో ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని సస్పెండ్ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో లంచాలు ఇచ్చే వారిపై, తీసుకునే వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఏ ప్రలోభాలకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు.
కొందరు ఉద్యోగులు పలు ప్రలోభాలకు లోబడుతూ నగదు కూడా తీసుకుంటూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనిపై ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు ఇటు వంటి ప్రలోభాలకు లోనుకావడం చెడు సంకేతం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో డబ్బులు పంచుతున్న నలుగురిని అరెస్టు చేసి ఎఫైఐఆర్ ఫైల్ చేశామన్నారు. అనంతపురంలో ఒక కానిస్టేబుల్ ఉద్యోగుల జాబితాను పట్టుకుని నగదు పంపిణీ చేస్తున్నట్లు గుర్తించి, సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
పలుచోట్ల నగదు సీజ్, పలువురి అరెస్ట్
విశాఖపట్నం తూర్పు నియోజక వర్గం పరిధిలోని ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర ఇద్దరు నగదుతో తిరగడాన్ని గుర్తించి నగదను సీజ్ చేసి వారిని అరెస్టు చేశారు. ఒంగోలులో యూపీఐ ద్వారా కొంత మంది ఉద్యోగులకు నగదు పంపించినట్లు గుర్తించామన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రాథమిక విచారణ జరిపించి, కాల్ డేటా, బ్యాంక్ ట్రాంగ్జాషన్ ద్వారా దాదాపు ఎనిమిది నుండి పది మంది ఉద్యోగులను గుర్తించామన్నారు.
వీవీఐపీలు రాష్ట్రంలో పర్యటిస్తున్న క్రమంలో వారి బందోబస్తు కార్యక్రమంలో పాల్గొంటున్న పోలీస్ శాఖ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడంలో సమస్యలు తతెత్తుతున్నాయి. వీరి ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించాలని సంబందిత జిల్లా ఎన్నికల అధికారులకు, ఎస్పీలకు ఆదేశాలు జారీచేశారు. అయితే ఎవరన్నా తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతే, ఈ 9న ఓటు హక్కును వినియోగించునే అవకాశం కల్పించారు.
పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న 4.30 లక్షల మందిలో 3.20 లక్షల మంది ఉద్యోగులు, 40 వేల పోలీసులు ఉన్నారు. హోమ్ ఓటింగ్ కేటగిరీ కింద 28 వేల మంది, ఎసెన్షయల్ సర్వీసెస్ కేటగిరీ కింద 31 వేల మంది, మిగిలిన వారిలో సెక్టార్ ఆఫీసర్లు, ఇతరులు ఉన్నట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వీరిలో ఇప్పటి వరకూ 2.76 లక్షల మంది ఉద్యోగులు ఫెసిలిటేషన్ సెంటర్లలోను, హోమ్ ఓటింగ్, ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీ కింద 28 వేల మంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. పలు రకాల కారణాల వల్ల కొందరు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకోలేదు. దాంతో సంబంధిత ఉద్యోగి ఏ ఆర్వో పరిధిలోనైతే ఓటు కలిగి ఉన్నాడో ఆ ఫెసిలిటేషన్ కేంద్రంలో స్పాట్ లోనే ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేలా మంగళ, బుధవారాల్లో కూడా అవకాశాన్ని కల్పించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఇదివరకే ఆదేశాలు జారీచేశారు. మే 8 వరకు వాళ్లు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.