AP Rains: ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు.. వాయుగుండం ప్రభావం మరో రెండ్రోజులు...
వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరి పంటలు నేలకొరిగాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం చెన్నైకి దగ్గరలో తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్నాయి. వీరఘట్టం, సారవకోట, ఆమదాలవలస, సరుబుజ్జిలి, నరసన్నపేట, కోటబొమ్మాళి, లావేరు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయని వాతావరణశాఖ తెలిపింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మరో అల్పపీడనం
రాగల 24 గంటల్లోనూ ఏపీలో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేసినట్టు రాష్ట్రవిపత్తు నిర్వహణశాఖ తెలిపింది. అత్యవసర సహాయ చర్యల కోసం చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించినట్టు తెలిపింది. మరోవైపు ఈ నెల 13 తేదీన అండమాన్ తీరప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు వాతావరణశాఖ వెల్లడించారు. నవంబరు 17న వాయుగుండం మరింత బలపడి కోస్తాంధ్ర తీరంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.
దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు
ప్రస్తుత వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయని వాతావరణశాఖ వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలో అత్యధికంగా 19.5 సెంటిమీటర్ల వర్షపాతం వాతావరణశాఖ ప్రకటించింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కమలాపురం పొడదుర్తి పాపాగ్ని నదిలో చిక్కుకున్న ఓ యువకుడిని అధికారులు కాపాడారు.
Also Read: వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. సగం బలహీనవర్గాల నేతలకే..!
నేలకొరిగిన వరి చేలు
వాయుగుండం ప్రభావంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమ వ్యాప్తంగా వందల ఎకరాల వరి పంట ముంపునకు గురై అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించిన పండించిన వరి పంట నేలనంటడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 80% శాతం వరి చేలు పాలు పోసుకునే దశలో ఉండగా ముంపునకు గురవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నారు. శుక్రవారం రాత్రి కూడా ఇదే తరహాలో వర్షం కురిస్తే పంటలపై ఆశలు వదులుకునే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు రైతులు.
Also Read: స్వర్ణముఖి వరదలో చిక్కుకున్న దంపతులు.. కాపాడిన ఫైర్ సిబ్బంది
నిండుకుండలా కళ్యాణి డ్యామ్
తిరుపతిలో వర్షం కారణంగా మరోమారు ఘాట్ రోడ్డులను టీటీడీ తాత్కాలికంగా మూసివేసింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం ఉదయం 4 గంటల వరకు ఘాట్ రోడ్లను మూసివేస్తామని తెలిపారు. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ పూర్తిస్థాయిలో నిండింది. దీంతో ఒక గేటును ఎత్తివేసి నీటిని బయటకు విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నీటిని విడుదల చేశారు. నీటిని విడుదల చేసే ముందు అధికారులు గంగ హారతి సమర్పించారు.
Also Read: తీరం దాటిన వాయుగుండం.. పొంచి ఉన్న మరో గండం.. ఈ ప్రాంతాలకు మళ్లీ భారీ వర్ష సూచన