YSRCP MLC : వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. సగం బలహీనవర్గాల నేతలకే..!
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులును వైఎస్ఆర్‌సీపీ ప్రకటించింది. సగం బలహీనవర్గాలకే ఇచ్చినట్లుగా సజ్జల తెలిపారు. వీరంతా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.
స్థానిక సంస్థల కోటా కింద 11 ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. జిల్లాల వారీగా ఆశావహులు, సామాజిక సమీకరణాలపై కసరత్తు చేసి ఈ మేరకు తుది జాబితాను ఖరారు చేశారు. ఈ జాబితాను ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ముగ్గుర్ని ప్రకటించేశారు. వీరితో కలిసి మొత్తం 14 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎమ్మెల్సీ స్థానాలు లభించినట్లయింది.
తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా నుంచి అనంత ఉదయభాస్కర్‌కు అవకాశం కల్పించారు. ఆయన ఏజెన్సీ ప్రాంతానికి చెందిన యువ నేత. గుంటూరు జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావుకు చాన్సిచ్చారు. ఈయన బీసీ వర్గానికి చెందిన వారు. ఇక గుంటూరు నుంచే మరొకరికి చోటుదక్కింది. సీనియర్ నేత, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు పొడిగింపు ఇచ్చారు. అలాగే చిత్తూరు జిల్లా నుంచి కుప్పం నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న భరత్‌కు చాన్సిచ్చారు. ఆయన తండ్రి చంద్రమౌళి గత ఎన్నికల్లోకుప్పం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే తరవాత ఆయన చనిపోయారు.
Also Read: ప్రభుత్వంపై ఇక తిరుగుబాటే .. ఉద్యోగ సంఘాల ఆగ్రహం !జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ బాయ్‌కాట్ !
అనంతపురం జిల్లా నుంచి ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన వై. శివరామిరెడ్డి, ప్రకాశం జిల్లా నుంచి తూమాటి మాధవరావు, విజయనగరం జిల్లా నుంచి ఇందుకూరు రఘురాజు, విశాఖ నుంచి వరుదు కల్యాణి, వంశీ కృష్ణ యాదవ్‌కు చాన్సిచ్చారు. వీరిద్దరూ గత ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ల కోసం ప్రయత్నించారు. వంశీకృష్ణ యాదవ్‌కు విశాఖ మేయర్ సీటు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి సంతృప్తి పరిచారు. ఇక కృష్ణా జిల్లా నుంచి ఇద్దరికి చాన్సిచ్చారు మొండితోక అరుణ్‌కుమార్, తలశిల రఘురాంలు ఎమ్మెల్సీలు కానున్నారు. తలశిల రఘురాం పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్‌గా ఉన్నారు.
Also Read : ఏపీ సీఎం జగన్ కాలుకు గాయం.. మణిపాల్ ఆస్పత్రిలో రెండు గంటల పాటు చికిత్స !
సామాజికవర్గాల సమీకరణాలు చూసుకోవడంతో పలువురు సీనియర్లకు అవకాశం కల్పించలేకపోయారు. ఏడుగురు ఓసీలు .. ఏడుగురు బలహీవర్గాలకు చెందిన వారికి చాన్సిచ్చామని వైఎస్ఆర్‌సీపీ ప్రకటించింది. స్ధానిక సంస్థల్లో వైఎస్ఆర్‌సీపీకి పూర్తి మెజార్టీ ఉండటంతో విపక్షాలు కూడా పోటీ పెట్టే అవకాశం లేదు.
Also Read : రూ. 25వేల కోట్ల బకాయిలు డిస్కంలకు చెల్లించండి.. ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ లేఖ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి