APERC : రూ. 25వేల కోట్ల బకాయిలు డిస్కంలకు చెల్లించండి.. ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ లేఖ !
డిస్కంలకు చెల్లించాల్సిన రూ. పాతికవేల కోట్లను తక్షణం చెల్లించాలని ఏపీఈఆర్సీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వ బకాయిలు వల్ల డిస్కంల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన సబ్సిడీతో పాటు విద్యుత్ బిల్లుల బకాయిలను చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ సంస్థ ( ఏపీఈఆర్‌సీ ) ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖ వ్యవహారం ప్రభుత్వ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు, డిస్కంలు, ఇంధన శాఖ సెక్రెటరీకి ఏపీఈఆర్సీ ఈ లేఖ పంపింది. మొత్తంగా ప్రభుత్వం నుంచి విద్యుత్ పంపిణీ సంసథలకు రూ. 25,257 కోట్ల బకాయి ఉందని ఈఆర్సీ గుర్తు చేసింది. ఈ లేఖను పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ బయట పెట్టారు.
అదానీ పవర్‌తో అత్యధిక రేటుకు కరెంట్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటన్నారని ఫిర్యాదు చేసేందుకు ఏపీఈఆర్సీ కార్యాలయానికి పయ్యావుల కేశవ్ 9వ తేదీన వెళ్లారు. ఆ రోజున ఈఆర్సీని కలిసి ఇంధన శాఖలో పరిస్థితులు, నిర్ణయాలపై అనేక వివరాలతో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏపీఆర్సీ ప్రభుత్వానికిలేఖ రాసింది. ప్రభుత్వం నుంచి డిస్కంలకు రూ. 15474 కోట్ల సబ్సిడీ బకాయిలు రావాల్సి ఉందని వెంటనే చెల్లించాలని లేఖలో ఈఆర్సీ కోరారు. అలాగే స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ శాఖలు విద్యుత్ ఉపయోగించుకుని బిల్లులు చెల్లించడం మానేశాయని.. ఈ మొత్తం రూ. 9783 కోట్లు రావాల్సి ఉందన్నారు.
Also Read : బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ భారీగా జరిగింది.. అభ్యర్థులు కోర్టుకు వెళ్తే వాళ్లు జైలుకే
అటు విద్యుత్ సబ్సిడీ బకాయిలు.. ఇటు ప్రభుత్వ సంస్థలు ఉపయోగించుకున్న బిల్లుల బకాయిలు మొత్తం కలిపి రూ. 25,257 కోట్లను ఫద్నాలుగు రోజుల్లోగా డిస్కంలకు చెల్లించాలని ఈఆర్సీ స్పష్టం చేసింది. బకాయిల చెల్లింపులపై 14 రోజుల గుడువుతో నోటీసులు ఇవ్వాలని... ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల నుంచి 14 రోజుల్లో స్పందన రాకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశించింది. ఇలా బకాయిలు పేరుకుపోవడం వల్ల డిస్కంల మనుగడే ప్రమాదంలో పడిందని ఏపీఈఆర్సీ లేఖలో పేర్కొంది.
Also Read : పంచ్ ప్రభాకర్ కోసం ఇంటర్‌పోల్ బ్లూ నోటీస్ ! ఆచూకీ తెలిసిన వెంటనే అరెస్ట్ ?
ప్రభుత్వ విద్యుత్తు పంపిణీ సంస్థలు పూర్తిస్థాయిలో దివాలా చట్టం పరిధిలోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. వాటి ఆస్తులను వేలం వేసి... ఏయే సంస్థలకు డిస్కమ్‌లు అప్పులు చెల్లించాలో ఆ సంస్థలకు వేలం సొమ్ము జమ చేయవచ్చు. రుణాలు, బాకీల చెల్లింపులో డిస్కమ్‌లు ఏ మాత్రం విఫలమైనా రుణదాతలు, అరువుపై డిస్కమ్‌లకు వస్తు, సేవలు సరఫరా చేసిన సంస్థలు దివాలా పరిష్కార ప్రక్రియ కోసం జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ను ఆశ్రయించవచ్చు. దీంతో ఏపీ డిస్కమ్‌లు తీవ్ర ఇబ్బందల్లో పడనున్నాయి. ఇప్పటికే జెన్‌కో తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో నిరర్థక ఆస్తిగా మారింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి