Anantapur TDP: అనంతపురం టీడీపీ నేతల్లో ఎన్నికల జోష్... అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా రాజకీయాలు !
అనంతపురం జిల్లా టీడీపీ నేతలు పరుగులు పెడుతున్నారు. పార్టీ కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తూ అధికార పార్టీ నేతల తీరును ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీంతో వారిలో ఎన్నికల జోష్ వచ్చినట్లయింది.
అనంతపురం తెలుగుదేశం నేతలు ట్రాక్‌లోకి వస్తున్నారు . వరుస ప్రోగ్రామ్ లతో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థుల సవాల్ కు ప్రతిసవాల్ విసురుతూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. జిల్లాలోని ముఖ్య నేతలంతా నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. గౌరవసభల పేరుతో టీడీపీ నేతలు చేస్తున్న రాజకీయాలు అధికార పార్టీలోనూ కాక రేపుతున్నాయి. పరిటాల వర్సెస్ తోపుదుర్తి , వరదాపురం సూరి, కాలువ శ్రీనివాస్ వర్సెస్ కాపు రాంచంద్రారెడ్డి ఇలా ఏ నియోజకవర్గం చూసినా ఆయా ప్రాంతాల సమస్యలను హైలెట్ చేస్తూ అధికార పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ చేస్తున్న రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో జిల్లాలో పరిటాల వర్సస్ తోపుదుర్తి, వరదాపురం సూరి కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు చర్చనీయాంశం అవుతున్నాయి.
రాప్తాడు నియోజకవర్గంలో తోపుదుర్తి కుటుంబం పై పరిటాల కుటుంబం చేసిన వ్యాఖ్యలకు తోపుదుర్తి ఇచ్చిన కౌంటర్ కూడా చర్చనీయాంశం అయ్యింది. పరిటాల కుటుంభ సభ్యులకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో ప్రకటించి వారేమైనా భూస్వాములా అంటూ ప్రశ్నించారు తోపుదుర్తి. ఎన్నికలకు ముందు ఉన్న ఇంటిని అమ్మేసిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి ఇప్పుడు వందల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు పరిటాల శ్రీరాం. దీంతో రాప్తాడు రాజకీయాలు ఒక్కసారిగా హాట్ హాట్ గా మారాయి.
Also Read: టీడీపీ వర్సెస్ టీడీపీ ! నేతల మధ్య ఆధిపత్య పోరాటమే ప్రతిపక్షానికి అసలు సమస్యా..!?
ఇక ధర్మవరం కు వస్తే ఇక్కడ కేతిరెడ్డి కంటే వరదాపురం సూరిపైనే ఎక్కువగా పోకస్ పెట్టింది పరిటాల కుటుంబం. మళ్ళీ టిడిపిలో చేరి తానే టికెట్ తెచ్చుకొని రంగంలోకి దిగుతాను అంటూ వరదాపురం సూరి వర్గీయులు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ గా పరిటాల శ్రీరాం చేస్తున వ్యాఖ్యలు వేడిని పుట్టిస్తున్నాయి. పరిటాల శ్రీరాం కు మద్దతుగా కదిరి మాజీ ఎంఎల్ఏ కందికుంట వెంకటప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కూడా జిల్లాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇక్కడ అధికార పార్టీ ఎంఎల్ఏపై పరిటాల శ్రీరాం కంటే వరదాపురం సూరి చేసిన అవినీతి ఆరోపణలే ఎక్కువ చర్చకు దారి తీశాయి అని చెప్పొచ్చు. ఇక రాయదుర్గంలో మాజీమంత్రి కాలువ శ్రీనివాస్ వర్సెస్ కాపు రాంచంద్రారెడ్డి మద్య జరగుతున్న పోరు అప్పుడే ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. ఇద్దరి మద్య మాటల యుద్దం తీవ్రరూపం దాల్చింది. గౌరవసభల పేరుతో కాలువ రాయదుర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు.
Also Read: తెలంగాణలోనూ ఏపీ తరహా మార్పులు... త్వరలో ఆన్‌లైన్ ప్రక్రియ: తలసాని
ఇలా ముఖ్యనేతలంతా నియోజకవర్గాల బాట పట్టేసరికి జిల్లాలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. అయితే టిడిపి నేతల గౌరవసభలను సునిశితంగా పరిశీలిస్తున్న టిడిపి అదిష్ఠానం ఎవరెవరు ప్రజల వద్దకు వెల్తున్నారు.పార్టీ కార్యక్రమాలను ఎవరెవరు కచ్చితంగా పాలో అవుతున్నారన్నది నివేదికలు తెప్పించుకుంటోంది. దీంతో నేతలు పోటీ పడి మరీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక్క హిందూపురం, తాడిపత్రిలో మాత్రం గౌరవసభ ల కార్యక్రమాలు జరగడం లేదు. శింగనమలలో కూడా టుమెన్ కమిటీ ఉన్నప్పటికి తూతూ మంత్రంగానే గౌరవసభలు జరగుతున్నాయి తప్పితే పెద్దగా ఎక్కడ కార్యక్రమాలు జరగడం లేదు. మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం నేతలు పోటీ పడుతున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి