TDP Fight : టీడీపీ వర్సెస్ టీడీపీ ! నేతల మధ్య ఆధిపత్య పోరాటమే ప్రతిపక్షానికి అసలు సమస్యా..!?
అనంతపురం టీడీపీలో జేసీ వర్సెస్ ఇతర నేతలు అన్నట్లుగా పరిస్థితి మారింది. గోరంట్ల ఎపిసోడ్ తర్వాత టీడీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందన్న ఆందోళన ఆ పార్టీ కార్యకర్తల్లో కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై పోరాడే విషయంలోనూ అంతర్గత సమస్యలు ఎదుర్కొంటోంది. ఓ వైపు అధికార పార్టీ వేధింపులకు బయపడి పెద్దగా నేతలు రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి లేకపోయింది. ఇప్పుడిప్పుడే కాస్త ధైర్యం కూడగట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి వారు కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ ప్రకటనలు చేసి అలజడి రేపుతున్నారు. వారిపై టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. అనంతపురం జిల్లాలో ఇదే జరుగుతోంది. వారు బహిరంగంగా మాట్లాడకుండా చేయడంలో పార్టీ హైకమాండ్ విఫలమయింది. ఫలితంగా టీడీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా పరిస్థితి మారింది.
జేసీ ప్రభాకర్‌పై విరుచుకుపడిన అనంతపురం జిల్లా టీడీపీ నేతలు !
జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే దూకుడైన నేత. ఆయన రాజకీయ ప్రత్యర్థులపై ఎలా దూకుడు చూపిస్తారో.. సొంత పార్టీలో ప్రత్యర్థులపైనా అదే తీరులో విరుచుకుపడతారు. అది టీడీపీకి మరోసారి అవగతమయింది. రెండున్నరేళ్లుగా రాయలసీమలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాకపోగా పనులు ఎక్కడివక్కడ ఆగిపోవడంతో రాయలసీమ టీడీపీ నేతలందరూ సదస్సు నిర్వహించారు. ఆ సదస్సుకు హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎందుకో కానీ కోపం వచ్చింది. ఏపీ మొత్తం మీద టీడీపీ గెలిచిన ఏకైక మున్సిపాల్టీ అయిన తాడిపత్రిలో తానే పార్టీని గెలిపిస్తే తనకు రావాల్సినంత ప్రయారిటీ రాలేదని అనుకున్నారేమో కానీ నేతల్ని చెడామడా తిట్టేసి వెళ్లిపోయారు. సహజంగానే జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలు ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయాయి. ఆయన అలా అని ఉండకూడదని టీడీపీ నేతలు అనుకున్నారేమో కానీ అప్పటికి స్పందించలేదు. కానీ ఆదివారం వరుస కట్టిగా స్పందించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
Also Read : రైతుల కోసం టీడీపీ ఉద్యమం
జేసీ ప్రభాకర్ స్పందిస్తే ఇక రచ్చ రచ్చే..!
అనంతపురం టీడీపీ నేతలంతా వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టి జేసీ ప్రభాకర్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. జేసీ బ్రదర్స్‌తో చాలా కాలం నుంచి విబేధాలున్న మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అసలు టీడీపీకి సమస్య జేసీ బ్రదర్సేనని తేల్చేశారు. తరచూ జగన్, వైఎస్‌లను పొగుడుతూ టీడీపీ కార్యకర్తలను కించ పరుస్తున్నారని మండిపడ్డారు. ఇక జేసీ విమర్శలు చేసిన మరో నేత పల్లె రఘునాథరెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. కుమ్మక్కవ్వాల్సిన అవసరం తమకు లేదని తన నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో అన్ని చోట్లా అభ్యర్థుల్ని నిలబెట్టానని తాడిపత్రిలో 24 గ్రామాల్లో అభ్యర్థుల్ని ఎందుకు నిలబెట్టలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. జేసీ సోదరులు టీడీపీలో లేనప్పుడే ఎక్కువ స్థానాలు గెలిచామని... జెడ్పీని కూడా గెలిపించుకున్నామన్నారు. మరో సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కూడా జేసీ ప్రభాకర్ విమర్శలపై స్పందించారు. కాల్వ శ్రీనివాసులపై విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. ఆయన నిబద్ధత కలిగిన టీడీపీ నేత అని.. వ్యక్తిగత విబేధాలుంటే హైకమాండ్‌తో మాట్లాడవచ్చన్నారు.
Also Read : ఏపీ ఫైబర్ నెట్ లో జరిగిన స్కామేంటి..?
అనంతపురం టీడీపీలో అన్నీ గ్రూపులే..!
నిజానికి జేసీ బ్రదర్స్ ఎక్కడ ఉన్న వారు అటు సొంత పార్టీలోని వర్గంతోనూ పోరాడుతూ ఉంటారు. కాంగ్రెస్‌లో ఉన్నా అంతే. టీడీపీలో ఉన్నా అంతే. టీడీపీ అధికారంలో ఉన్నకాలంలో ఏ ఒక్క టీడీపీ నేతతోనూ వారికి సన్నిహిత సంబంధాలు లేవు. జిల్లా మొత్తం తమ అనుచరులకే టిక్కెట్లు ఇప్పించుకోవాలని పట్టుబడుతూ ఉంటారు. వారి మాట ప్రకారమే ఎక్కువ మందికి టిక్కెట్లు లభించాయి కూడా. ఆ పట్టును మళ్లీ కొనసాగించాలని అనుకుంటున్నారేమో కానీ అసంతృప్త స్వరాలు మాత్రం ఎక్కువగా వినిపిస్తూ ఉన్నారు. టీడీపీకి అనంతపురం జిల్లాలో నేతలు ఎక్కువ, పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, నిమ్మల కిష్టప్ప, కాల్వ శ్రీనివాసులుతో పాటు జేసీ బ్రదర్స్ కూడా పట్టు ఉన్న నేతలుగా ఉన్నారు. వీరందరిలో తామే గొప్ప అని మిగతా వారు ఎవరూ కాదని చెప్పుకునేందు జేసీ బ్రదర్స్ తాపత్రయం వల్ల సమస్యలు వస్తున్నాయంటున్నారు.
Also Read : కోర్టులలో పోర్టుల డీల్స్
పార్టీ నేతల మధ్య సమన్వయం చేయడంలో టీడీపీ హైకమాండ్ విఫలం !
గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎపిసోడ్ కూడా అంతే. ఆయన మాటల్ని పార్టీ హైకమాండ్ ఆలకించి ఉంటే ఆయన తెరపైకి వచ్చేవారు కాదు. కానీ పట్టించుకోకపోవడం వల్ల బహిరంగ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. దీంతో మీడియాలో టీడీపీలో పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది. అటు జేసీ అయినా ఇటు బుచ్చయ్య అయినా పార్టీ అంతర్గత విషయాలను మీడియా ముందు చర్చించవద్దని పార్టీ హైకమాండ్ గట్టిగా చెప్పినట్లయితే ఈ సమస్య ఉండేది కాదు. కానీ అలా మీడియా ముందుకు రాకుండా ఉండాలంటే సీనియర్లు చెప్పేది పార్టీ హైకమాండ్ వినాల్సి ఉంది. కానీ వింటుందో లేదో క్లారిటీ లేదు. అటు బుచ్చయ్య కానీ ఇటు జేసీ కానీ చంద్రబాబు ఇప్పటికైనా తెలుసుకోవాలని అంటున్నారు. అయితే ఇక్కడ అసలు విషయం వారికి సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే స్పందించారు. మిగతా సందర్భాలలో పెద్దగా స్పందించలేదు. అందుకే టీడీపీ హైకమాండ్ వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తోంది.
Also Read : టీడీపీలో ఏం జరుగుతోంది ?
అధికారపక్షంపై పోరాటం కన్నా సొంత పార్టీ పంచాయతీలే ఎక్కువ !
అయితే అసంతృప్తి స్వరాలను బుజ్జగించడంతోనే సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే ఒకరిని బుజ్జగిస్తే మరొకరు తెరపైకి వస్తారు. అయితే బుచ్చయ్య కానీ ప్రభాకర్ రెడ్డి కానీ కార్యకర్తల గురించే చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చారని.. పార్టీకి సేవ చేసిన వారిని పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడు కూడా పార్టీ పరిస్థితి మెరుగుపడే కొద్దీ అలాంటి వారుతెరపైకి వస్తున్నారన్న అసంతృప్తి కారణంగానే ఈ సీనియర్లు అలాంటి ప్రకటనలు చేస్తున్నారంటున్నారు. కారణం ఏదైనా కానీ ఇలాంటి విషయాలను అంతర్గతంగా పరిష్కరించుకోకపోతే ఇలాంటివి పెరిగిపోయే అవకాశం ఉంది. అప్పుడు అధికార పార్టీతో పోరాడటం కన్నా ఇలాంటి వాటిని కవర్ చేసుకోవడానికే ఎక్కువసమయం పడుతుంది. అది అంతిమంగా ప్రతిపక్షం పని తీరు సొంత సమస్యలు తీర్చుకోవడానికే పరిమితం అవుతుంది.
Also Read : ఆ గ్రామంలో దళిత బంధు మరో పైలట్ ప్రాజెక్ట్