TDP : నిన్న బుచ్చయ్య - నేడు జేసీ ప్రభాకర్ ! టీడీపీలో సీనియర్ల రెబలిజం వెనుక కారణం ఆ అసంతృప్తేనా..!?
టీడీపీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ మొన్న బుచ్చయ్య చౌదరి.. ఇవాళ ప్రభాకర్ రెడ్డి సొంత పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల ఆగ్రహం టీడీపీ కార్యకర్తల కోసమేనా..? వేరే రాజకీయం ఉందా..?
" కార్యకర్తలను పట్టించుకోవడం లేదు !" ఈ మాట తెలుగుదేశంలో ఇప్పుడు తరచుగా వినిపిస్తోంది. నిన్నామొన్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజకీనామా ఎపిసోడ్‌లో ప్రధానంగా ఇదే అంశం తెరపైకి వచ్చింది. ఇప్పుడు అనంతపురంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్మోహమాటంగా టీడీపీ సదస్సులోనే ఈ విషయాన్ని తేల్చేశారు. తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది...? టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత నేతలు సేఫ్ గేమ్ ఆడుతూ కార్యకర్తల్ని గాలికి వదిలేశారా..? కొంత మంది సీనియర్ నేతలు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు..?
అధికార పార్టీ వేధింపుల నుంచి కార్యకర్తలకు రక్షణ కల్పించని జిల్లా, నియోజకవర్గ నేతలు..!
తెలుగుదేశం పార్టీ అంటే గ్రామ గ్రామాన ఉన్న క్యాడర్ పార్టీ అని చెప్పుకుంటారు. ఆ పార్టీకి ఉన్న సంస్థాగత నిర్మాణాన్ని ఇతర పార్టీలు ఆదర్శంగా తీసుకుంటాయి. పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేలా ఒకదానిపై ఒకటి పార్టీ అధ్యక్షుడి స్థాయి వరకూ ఏర్పాట్లు ఉంటాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ కార్యకర్తల సంక్షేమ బాధ్యతలు చూస్తున్నారు. సభ్యత్వం తీసుకున్న వారందరికీ ఇన్సూరెన్స్ .. వారికి క్లెయిమ్‌లు సహా అనేక విషయాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున అనేక స్కూళ్లు నిర్వహిస్తూ కార్యకర్తల పిల్లలకు అందులో నాణ్యమైన విద్య అందిస్తూ ఉంటారు. అయితే అది సంక్షేమం. కానీ రాజకీయంగా చూస్తే కార్యకర్తలకు అండగా ఉండాల్సింది.. రాజకీయ వేధింపుల నుంచి కాపాడాల్సింది నియోజకవర్గ జిల్లా స్థాయి నేతలే. కానీ టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత అప్పటి వరకూ పదవులు అనుభవించిన వారిలో 90 శాతం మంది తమను తాము రక్షించుకోవడానికే సమయం వెచ్చించారు కానీ కార్యకర్తలను పట్టించుకోలేదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు కొంత మంది సీనియర్ నేతలే వీటిని బహిరంగ పరుస్తున్నారు. Also Read : అనంత టీడీపీలో జేసీ కలకలం
ఇప్పుడు హడావుడి ప్రారంభించడంపై గోరంట్ల, జేసీ వంటి నేతల అసహనం..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలపై వేధింపులు పెరిగిపోయాయని టీడీపీ నేతలు చాలా రోజుల నుంచి ఆరోపిస్తున్నారు. అయిన దానికి కాని దానికి కేసులు పెట్టడం.. అరెస్టులు చేయడం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇదే కారణం ఏమోకానీ టీడీపీ లో దిగ్గజాలనదగ్గ నేతలంతా సైలెంట్ అయిపోయారు. రెండేళ్ల పాటు వారి మౌనం అలా కొనసాగింది. వైసీపీ నేతలకు ఎదురెళ్లి పోరాడింది లేదు. ఆ ఫలితమే స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయానికి దారి తీసింది. పోరాడి ఉండే కనీసం పరువైనా దక్కి ఉండేదని అంటూంటారు. పార్టీపై నిఖార్సైన అభిమానం ఉండి ఎంత నష్టపోయినా వెనక్కి తగ్గని నేతల్లో ఆ కారణంగానే అసంతృప్తి వెల్లువెత్తుతోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి నిబద్దతతో దశాబ్దాలుగా సేవ చేస్తున్న వ్యక్తి. ఆయనకు ప్రత్యేకమైన రాజకీయ ప్రయోజనాలు ఉండవు. పార్టీ మేలు కోరుతారు. ఈ కారణంగానే ఆయన నిర్మోహమాటంగా తన అభిప్రాయాలు చెప్పారు. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీవ్రమైన వేధింపులు ఎదుర్కొన్న టీడీపీ నేతల్లో ఒకరు. ఆయన పలుమార్లు అరెస్టయ్యారు. ఆయన వ్యాపారాలన్నింటినీ ప్రభుత్వం నిలిపివేయించింది. అయినా సరే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గకుండా పోరాడుతున్నారు. ఆయన కూడా పార్టీ పరిస్థితిపై ఇతర నేతల తీరుపై అదే కారణంతో అసంతృప్తి వ్యక్తం చేశారు Also Read : ఏపీ స్కూళ్లలో కరోనా భయం..భయం
కార్యకర్తలను కాపాడుకున్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ !
అధికార పార్టీకి భయపడి అత్యధిక శాతం టీడీపీ సీనియర్ నేతలు నోరు తెరవని సమయంలో కార్యకర్తల కోసం కష్టనష్టాల కోసం ఎదురు నిలబడిన నేతలు ఇప్పుడు కార్యకర్తలను పట్టించుకోవాలని తెర ముందుకు వస్తున్నారు. కార్యకర్తలను పట్టించుకున్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ల కావడం రాజకీయ పరిస్థితుల్లో మార్పులు వస్తూండటంతో ఇప్పుడు కొంత మంది టీడీపీ నేతలు హడావుడి ప్రారంభించారు. ఇప్పటి వరకూ పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకోనివారు ఇప్పుడు ప్రత్యేక కార్యక్రమాల పేరుతో హడావుడి చేసి మైలేజ్ కోసం ప్రయత్నాస్తున్నారన్న అంశాన్ని హైలెట్ చేయడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి అసంతృప్తి స్వరాలను వినిపిస్తున్నట్లుగా అంచనా వేయవచ్చు. Also Read : వైఎస్ వివేకాను హత్య చేసింది వాళ్లిద్దరేనా..?
ఈ అసంతృప్తిపై చంద్రబాబు దృష్టి సారిస్తారా..?
రాజకీయాలు రానురాను వ్యక్తిగత శత్రుత్వాలకు దారి తీస్తున్నాయి. ఓ పార్టీలో ఉంటే మరో పార్టీ నేతలు శత్రువులే అన్నట్లుగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితులకు ఇమడలేకపోతున్న నేతలు కార్యకర్తలను కూడా కాపాడుకోలేకపోతున్నాకన్న అభిప్రాయాలు టీడీపీలో ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారాలను టీడీపీ అధినేత చంద్రబాబు పరిశీలించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు సీనియిర్ల నుంచి వస్తున్నాయి. లేకపోతే ఈ అసంతృప్తి స్వరాలు పెరిగిపోతూనే ఉంటాయని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.