Minister Botsa : మాకు ఇగో లేదు, సీపీఎస్ పై మూడ్రోజుల్లో చర్చిస్తాం- మంత్రి బొత్స
Minister Botsa : వైసీపీ ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో రెండు అంశాలపై చర్చించామన్నారు. ఫేస్ రికగ్నిషన్ యాప్ లో సమస్యలుంటే పరిష్కరిస్తామన్నారు.
Minister Botsa : ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం భేటీ అయ్యారు. ఫేస్ రికగ్నిషన్ యాప్ సహా ఉపాధ్యాయ సంఘాలు ప్రస్తావించిన పలు అంశాలపై ఈ భేటీలో మంత్రి బొత్స చర్చించారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో ప్రధానంగా రెండు అంశాలపై చర్చించామన్నారు. ఫేస్ రికగ్నిషన్ యాప్‌లో సాంకేతిక సమస్యలను పరిష్కారిస్తామని మంత్రి తెలిపారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తెస్తే తప్పకుండా పరిష్కరిస్తామన్నారు. టీచర్లపై పెట్టిన కేసుల అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానన్న బొత్స సత్యనారాయణ... తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 86 శాతం మంది ఉపాధ్యాయులు యాప్‌లో హాజరు నమోదు చేశారన్నారు.
సర్వీస్ రూల్స్ అమలు
సర్వీస్ నిబంధనల్లో ఉన్న అంశాలనే అమలు చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీచర్స్ తో పాటు విద్యార్థులకు మంచి చేయాలనేదే తమ తపన అన్నారు. సీపీఎస్ అంశంపై మూడ్రోజుల్లో ఉద్యోగులతో చర్చిస్తామన్నారు. 670 ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని సీఎం జగన్ చెప్పారన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం పెండింగ్‌లో ఉన్న 248 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎంఈవోలుగా నియమిస్తాన్నారు. కొత్తగా 38 డిప్యూడీ డీఈవో పోస్టులను భర్తీ చేస్తున్నట్లు మంత్రి బొత్స తెలిపారు.
మాకు ఇగో లేదు
ఉపాధ్యాయ సంఘాల నేతలతో రెండు అంశాలపై ముఖ్యంగా చర్చించామని మంత్రి బొత్స తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాని చెప్పారు. ఫేస్ రికగ్నిషన్ యాప్ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలనేదే సీఎం జగన్ ఉద్దేశామన్నారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఎప్పటి నుంచో వస్తున్న సిస్టమేనని కొత్తగా పెట్టింది ఏమీ లేదని మంత్రి బొత్స తెలిపారు. సర్వీస్ రూల్స్ అమలు చేస్తున్నామన్నారు. తమకు ఇగో లేదని, ఉపాధ్యాయులు, విద్యార్థులకు మంచి చేయాలనేదే తమ తపన అని బొత్స అన్నారు.
ఉపాధ్యాయుల ఫోన్లలోనే హాజరు యాప్
తమ ఫోన్లలో ఫేస్ రికగ్నిషన్ యాప్ డౌన్లోడ్ చేసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ తెలిపారు. ఈ యాప్ లో ఉన్న సాంకేతిక సమస్యలు పరిశీలించేందుకు 15 రోజుల సమయం కోరామన్నారు. సాంకేతిక ఇబ్బందులు తొలగించిన తర్వాతే పూర్తి స్థాయిలో అమలు చేయాలని సూచించామని తెలిపారు. ఉమ్మడి సర్వీస్ నిబంధనలు న్యాయస్థాన పరిధిలో ఉన్నందున 248 ఎంఈవో పోస్టులను ప్రభుత్వ టీచర్లతో ఎఫ్ఏసీలుగా భర్తీ చేయబోతున్నామని ప్రభుత్వం తెలిపిందన్నారు. 672 ఎంఈవో పోస్టులను జెడ్పీ టీచర్లతో ఎఫ్ఏసీలుగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఫేస్ రికగ్నిషన్ యాప్ ఉపాధ్యాయుల ఫోన్లల్లోనే డౌన్ లోడ్ చేసుకోవాలని మంత్రి బొత్స సూచించారన్నారు. యాప్ లో సాంకేతిక లోపాలు ఉంటే పరిష్కరిస్తామని మంత్రి తెలిపారన్నారు.
Also Read : Malladi Vishnu : ఏపీ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్‌గా మల్లాది విష్ణు - కేబినెట్ హోదా ఇచ్చిన సీఎం జగన్ !
Also Read : CM Jagan Review : ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టండి, అధికారులకు సీఎం జగన్ క్లాస్