CM Jagan Review : ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టండి, అధికారులకు సీఎం జగన్ క్లాస్
CM Jagan Review : ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖలు పారదర్శన విధానాలు అమలు చేయాలని సీఎం జగన్ అన్నారు. 2018-19తో పోలిస్తే 2021-22లో మద్యం వినియోగం బాగా తగ్గిందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.
CM Jagan Review : ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆదాయాలను సమకూరుస్తున్న శాఖల అధికారులతో సీఎం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆదాయాల పరంగా వివిధ శాఖలు, వాటి లక్ష్యాలను సమీక్షించిన సీఎం, లీకేజీలు లేకుండా పారదర్శక విధానాలు అమలు చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మద్యం వినియోగం బాగా తగ్గిందని అధికారులు సీఎంకు వివరించారు. 2018–19తో పోలిస్తే లిక్కర్ అమ్మకాలు 384.31 లక్షల కేసులు కాగా, ఇప్పుడు 2021–22లో 278.5 లక్షలకు తగ్గిందని అధికారులు తెలిపారు. 2018–19లో బీరు అమ్మకాలు 277.10 లక్షల కేసులు కాగా, 2021–22లో 82.6 లక్షల కేసులకు తగ్గిందని అధికారులు సీఎం కు తెలిపారు.
మద్యం వినియోగం తగ్గింది-సీఎం జగన్
2018–19లో మద్యం విక్రయాలపై ఆదాయం రూ.20,128 కోట్లుకాగా, 2021–22లో మద్యం విక్రయయాలపై ఆదాయం రూ. 25,023 కోట్లుగా ఉందని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. ధరలు షాక్ కొట్టేలా పెట్టడంతో మద్యం వినియోగం గణనీయంగా తగ్గిందన్న అభిప్రాయాన్ని సీఎం జగన్ వ్యక్తం చేశారు. బెల్టుషాపులు ఎత్తివేయడం, ధరలు విపరీతంగా పెంచడంతో వినియోగాన్ని బాగా నియంత్రించామని సీఎం అన్నారు. గడచిన ఆరు నెలల్లో అక్రమ మద్యం తయారీ, రవాణా, గంజాయిలకు సంబంధించి మొత్తంగా 20,127 కేసులు నమోదు చేశామని అధికారులు సీఎంకు వివరించారు. ఇందులో 16,027 మందిని అరెస్టు చేయగా, 1,407 వాహనాలు సీజ్ చేశామన్నారు. నాటుసారా తయారీ వృత్తిగా ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు అధికారులు.
కాలేజీలు, యూనివర్సిటీల ముందు ఎస్ఈబీ నెంబర్
నాటుసారా తయారీలో ఉన్న వారిని దాని నుంచి బయటపడేయాలని కౌన్సిలింగ్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. స్వయం ఉపాధి పెంచి, గౌరవప్రదమైన ఆదాయాలు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, గంజాయి లాంటి వాటికి విద్యార్థులు, యువత లోనుకాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కాలేజీ, యూనివర్సిటీల ముందు ఎస్‌ఈబీ నంబర్‌ను డిస్‌ప్లే చేయాలని సీఎం ఆదేశించారు. ఎస్‌ఈబీ నంబర్‌తో బోర్డులు పెట్టాలన్నారు. ఎక్కడా కూడా మాదక ద్రవ్యాలకు సంబంధించి వ్యవహారాలు ఉండకూడదన్నారు. కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని, సెప్టెంబరు నెలాఖరుకల్లా ఈ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి సాగును నివారించేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలన్న సీఎం, వారి జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయాలను సూచించాలన్నారు.
గంజాయి సాగుపై దాడులు
క్రమం తప్పకుండా గంజాయి సాగుపై దాడులు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వం నుంచి ఇప్పటికే వివిధ పంటలకు సంబంధించి విత్తనాలు అందించామని అధికారులు తెలిపారు. ఇప్పటికే 2500 ఎకరాల్లో వేరే పంటలు సాగు చేశారని తెలిపారు. పండించిన పంటలను జీసీసీ ద్వారా కొనుగోలు చేస్తామని అధికారులు వెల్లడించారు. ఇంకా 1600 ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగుకు అన్నిరకాల చర్యలు తీసుకున్నామన్నారు. మిగిలిన చోట్ల ఎక్కడైనా గంజాయి సాగు చేస్తే.. దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయిని వదిలేసి వివిధ పంటలు సాగు చేస్తున్న వారికి ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలు ఇచ్చి, వారికి రైతు భరోసా వర్తింపు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏసీబీకి సంబంధించిన 14400 నంబర్ అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్దా కనిపించాలని సీఎం ఆదేశించారు. గ్రామ సచివాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు, పోలీస్ స్టేషన్ నుంచి ఎస్పీకార్యాలయం వరకూ, పీడీఎస్ షాపుల వద్ద కూడా ఏసీబీ నెంబర్ బోర్డులు కనిపించాలని అదేశించారు.
ఎర్రచందనం విక్రయాలపై
పాస్‌పోర్టు ఆఫీసుల తరహాలో సబ్ రిజిస్టర్ ఆఫీసులను తీర్చిదిద్దాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మైనింగ్‌కు సంబంధించి అన్నిరకాల అనుమతులు పొంది, లైసెన్స్‌లు తీసుకున్న వారు ఆ గనుల నిర్వహిస్తున్నారా? లేదా? అన్నది పరిశీలన చేయాలన్నారు. జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని కలెక్టర్‌తో కలిసి లైసెన్స్‌లు పొందిన చోట ఆపరేషన్స్‌లో ఉండేలా చూడాలన్నారు. ఒకవేళ ఆపరేషన్స్‌లో లేకపోతే కారణాలు కనుక్కొని ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వాటిని సానుకూలంగా పరిష్కరించే ప్రయత్నాలు చేయాలన్నారు. అన్ని అనుమతులూ పొంది ఆపరేషన్స్ చేయకపోతే ఆదాయం రాదన్నారు. ఎర్రచందనం విక్రయానికి అన్నిరకాల అనుమతులు వచ్చాయని అధికారులు సీఎం కు తెలిపారు. అక్టోబరు – మార్చి నెలల మధ్య 2640 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం విక్రయానికి ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఎర్రచందనం విక్రయంలో అత్యంత పారదర్శక విధానాలు పాటించాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రేడింగ్‌లో థర్డ్ పార్టీ చేత కూడా పరిశీలన చేయించాలని సీఎం జగన్ సూచించారు.
Also Read : chandrababu CM : మొదటి సారి సీఎంగా ప్రమాణం చేసి నేటికి 27 ఏళ్లు - చంద్రబాబు ఎమోషనల్ రెస్పాన్స్ చూశారా?