Malladi Vishnu : ఏపీ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్‌గా మల్లాది విష్ణు - కేబినెట్ హోదా ఇచ్చిన సీఎం జగన్ !
మల్లాది విష్ణుకు కేబినెట్ హోదాతో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవిని ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతిని తొలగించనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
Malladi Vishnu : ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్‌గా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు కేబినెట్ హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. రెండేళ్ల పాటు ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ పదవిలో మల్లాది విష్ణు కొనసాగనున్నారు. మల్లాది విష్ణు ఇటీవలి వరకూ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉండేవారు. సీనియర్ నేత కావడంతో తనకు మంత్రివర్గ విస్తరణలో పదవి లభిస్తుందని అనుకున్నారు. కానీ ఆయనకు అవకాశం లభించలేదు. అదే సమయంలో ఆయనకు ప్రాధాన్యం కల్పిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆ మేరకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవిని ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
మంత్రి పదవి ఇవ్వలేకపోవడంతో కేబినెట్ హోదాతో పదవి
మల్లాది విష్ణును ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా నియమించనున్నట్లుగా మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడే వైఎస్ఆర్‌సీపీ వర్గాలు ప్రకటించాయి. అయితే ఉత్తర్వులు మాత్రం తాజాగా విడుదలయ్యాయి. ఆయనకే ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గా ప్రసాదరాజును నియమించారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ప్రసాదరాజుకు ఈ పదవిని ఇచ్చారు. చీఫ్ విప్ కేబినెట్ హోదా ఉంటుంది.ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కోన రఘుపతి ఉన్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామిని నియమించనున్నారు.ఈ కారణంగా వారి సామాజికవర్గానికి కేబినెట్ హోదాతో ఓ పదవి ఉండాలన్న ఉద్దేశంతో మల్లాది విష్ణుకు కేబినెట్ హోదా ప్రకటించినట్లుగా భావిస్తున్నారు.
వైఎస్ఆర్ ఆత్మీయుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మల్లాది విష్ణు
విష్ణు కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం విజయవాడ సెంట్రల్ నుంచి 2009లో పోటీచేసి వంగవీటి రాధాపై ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే జగన్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన తర్వాత జగన్‌తో కలసి నడవలేదు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపునే పోటీ చేశారు. వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యంత్రిగా ఉన్న సమయంలో విజయవాడ పట్టణ అభివృద్ధి అథారిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. 2019 ఎన్నికలకు వైఎస్సార్‌సీపీలో చేరారు.. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆయన గతంలో మంత్రి పదవి ఆశించినా దక్కలేదు.. ఇప్పుడు కేబినెట్ హోదాతో పదవి దక్కింది.
వైఎస్ఆర్‌సీపీ తరపున గట్టిగా వాయిస్ వినిపిస్తున్న మల్లాది విష్ణు
మల్లాది విష్ణు వైఎస్ఆర్‌సీపీ తరపున గట్టిగా వాయిస్ వినిపిస్తూంటారు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన నేతలు ఎవరైనా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా ఎదురుదాడి చేస్తారు. గతంలో కేటీఆర్ ఏపీలో జీవితం నరక ప్రాయణని వ్యాఖ్యలు చేసినప్పుడు...మళ్లీ సమైక్య రాష్ట్రం చేయాలన్న వాదన వినిపించారు. మంత్రి పదవి దక్కకపోయినా కేబినెట్ హోదా లభించడంతో ... ఆయన అనుచరులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సామాజిక న్యాయం చేసినట్లుగా వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ చెబుతోంది.
మొదటి సారి సీఎంగా ప్రమాణం చేసి నేటికి 27 ఏళ్లు - చంద్రబాబు ఎమోషనల్ రెస్పాన్స్ చూశారా?