అల్లు అర్జున్ కేసు FIRలో అసలేముంది?
నటుడు అల్లు అర్జున్ కొత్త సినిమా పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య 70 ఎంఎం థియేటర్ లో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అల్లు అర్జున్ అభిమానులతో కలిసి ప్రీమియర్ షో చూసేందుకు అక్కడికి వచ్చారు. అల్లు అర్జున్ ను చూడాలని జనం పోటెత్తడంతో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. దీంతో అల్లు అర్జున్ పైన కూడా చిక్కడ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో భాగంగా డిసెంబర్ 13న మధ్యాహ్నం పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వచ్చి మరీ అరెస్టు చేసి.. చిక్కడ పల్లి పీఎస్‌కు తరలించారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్టులో కీలక వివరాలు ఉన్నాయి. దాని ప్రకారం.. అల్లు అర్జు్న్ పైన భారత న్యాయ సంహితలోని 105, 118(1), r/w 3(5) సెక్షన్ల కింద కేసులు పెట్టారు. డిసెంబర్ 4 రాత్రి 9.10 నుంచి 9.40 వరకూ ఘటన జరిగింది. ఇందులో ఈ కేసు పెట్టిన వారి వివరాలు కూడా ఉన్నాయి. దిల్ సుఖ్ నగర్ కు చెందిన భాస్కర్ మాగుడంపల్లి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన రేవతి భర్త ఈయన. ఈ వ్యవహారంలో సంధ్య థియేటర్ మేనేజ్‌మెంట్, సిబ్బందితో పాటు, నటుడు అల్లు అర్జున్, ఆయన వ్యక్తిగత సిబ్బందిని కూడా ఎఫ్ఐఆర్ లో అనుమానితులుగా చేర్చారు. చనిపోయిన రేవతి భర్త ఇచ్చిన ఫిర్యాదు ఇలా ఉంది. అల్లు అర్జున్ వచ్చిన సమయంలో మేం లోవర్ బాల్కనీలో ఉన్నాం. విపరీతంగా వచ్చిన జనాల తాకిడికి నా భార్య, కుమారుడు ఊపిరి తీసుకోలేక కింద పడిపోయారు. వారిని దగ్గరల్లోని ఆస్పత్రికి తరలించేలోపే ఆమె చనిపోయింది. ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా పెద్దఎత్తున జనాల్ని థియేటర్ లోకి అనుమతించడం వల్లనే ఈ ఘటన జరిగింది. ఇందుకు కారకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని బాధితుడు భాస్కర్ ఫిర్యాదు చేశారు.