Pakistan Fate Depends on Weather | వాతావరణంపై ఆధారపడ్డ పాక్ ప్రపంచకప్ ప్రయాణం
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. తన మొదటి మ్యాచ్‌లోనే యూఎస్ఏ చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలైంది. ఈ ఓటమి పాకిస్తాన్ సూపర్-8 అవకాశాలను దెబ్బ తీసింది. అనంతరం భారత్ చేతిలో కూడా ఆరు పరుగులతో ఓటమి చవిచూసింది. అనంతరం కెనడాపై ఏడు వికెట్లతో విజయం సాధించింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఈ టోర్నమెంట్‌లో ముందుకు సాగాలంటే ఐర్లాండ్‌తో ఆడనున్న చివరి మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలి. కానీ వాతావరణం ఇప్పుడు పాక్ కొంపముంచేలా ఉంది.
అమెరికాలోని ఫ్లోరిడాలో మూడు మ్యాచ్‌లు షెడ్యూల్ అయి ఉన్నాయి. జూన్ 16వ తేదీన ఇదే వేదికలో పాకిస్తాన్, ఐర్లాండ్ జట్లు తలపడనున్నాయి. కానీ అక్కడి వాతావరణ పరిస్థితులు ఆటకు అనుకూలించేలా లేవు. వరదల కారణంగా ఫ్లోరిడాలో ప్రస్తుతం ఏకంగా ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు.
ఒకవేళ పాకిస్తాన్, ఐర్లాండ్ మ్యాచ్ రద్దయితే రెండు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. అప్పుడు పాకిస్తాన్ దగ్గర మూడు పాయింట్లు ఉంటాయి. యూఎస్ఏ వద్ద ఇప్పటికే నాలుగు పాయింట్లు ఉన్నాయి కాబట్టి చివరి మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఇండియా, యూఎస్ఏ టోర్నమెంట్‌లో సూపర్-8కు చేరుకుంటాయి. కాబట్టి పాక్ టోర్నమెంట్‌లో ముందుకు వెళ్లాలంటే ఆ మ్యాచ్ జరగాలి, వాళ్లు గెలవాలి.