Temba Bavuma with his son Lihle Bavuma | వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలిచిన తర్వాత కొడుకుతో బవుమా వీడియో | ABP Desam
ఐదున్నర అడుగులు కూడా లేని తెంబా బవుమా క్రికెట్ ఆడటానికి పనికొస్తాడా అన్న మాటలను..జాతివివక్ష వ్యాఖ్యలను ఎడమ కాలితో తొక్కుతూ కసితో క్రికెటర్ గా ఎదిగిన తెంబా బవుమా నిన్న నాయకుడిగా తన జట్టు సౌతాఫ్రికాను విశ్వవిజేతగా నిలిపాడు. లార్డ్స్ లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను ఐదు వికెట్ల తేడాతో టెస్ట్ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకుంది సౌతాఫ్రికా. అంతే కెప్టెన్ తెంబా బవుమా ఎమోషనల్ అయిపోయాడు. ఎప్పుడైతే ప్రపంచ విజేతల గదను ఐసీసీ ఛైర్మన్ జైషా తన చేతిలో పెట్టాడో తన జట్టుతో కలిసి ఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్న బవుమా తన కుటుంబంతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. తన భార్య, బిడ్డలకు దగ్గరకు వెళ్లిన బవుమా తన కుమారుడు లిహ్లీ బవుమాను ఆత్మీయంగా హత్తుకుని తన క్యాప్ చిన్ని బవుమాకు పెట్టాడు. తర్వాత లిహ్లీని ఎత్తుకుని గ్రౌండ్ మొత్తం తిప్పుతూ...జీవితంలో తను సాధించింది ఏంటో చూపించాడు. అవమానాలు, ఛీత్కారాలు ఎదురవుతాయని వాటన్నింటినీ దాటుకుని విజేతలుగా నిలిస్తే ఇదే ప్రజలు ఎలా అభినందిస్తారో తన చిన్నారి కొడుక్కి చూపించాడు తెంబా బవుమా. ఈ ఎపిసోడ్ మొత్తం ఎమోషనల్ గానూ లయన్ కింగ్ సినిమాను తలపించింది. ఆ సినిమాలో ముఫాసా తన కొడుకు సింబాకి నేర్పినట్లు ప్రపంచం గురించి తెంబా బవుమా తన చిన్నారి బాబు లిహ్లీ బవుమాకు నేర్పినట్లుగా ఉంది. అందుకే ఐసీసీ షేర్ చేసిన రీల్స్ కి కూడా లయన్ కింగ్ మ్యూజిక్ నే యాడ్ చేసింది. మొత్తం లిహ్లీ బవుమా, తెంబా బవుమా క్యూట్ క్యూట్ ఫోటోలు, రీల్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.





















