Shubman Gill 114* vs Eng 2nd Test | రెండు టెస్టుల్లో రెండు సెంచరీలు బాదిన కెప్టెన్ గిల్ | ABP Desam
211 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి టీమిండియా రెండో టెస్టులో పట్టుకోల్పోయే దిశగా సాగుతున్న టైమ్ లో తనలోని క్లాస్ బ్యాటర్ ను మరోసారి పరిచయం చేశాడు కెప్టెన్ శుభ్ మన్ గిల్. రవీంద్ర జడేజా తోడుగా ఆరో వికెట్ కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శుభ్ మన్ గిల్ రెండో టెస్టులో సెంచరీ పూర్తి చేసుకుని ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. కెప్టెన్ గా ఆడుతున్న మొదటి సిరీస్ లోనే వరుసగా రెండు టెస్టుల్లో రెండు సెంచరీలు బాదిన నాలుగో ఇండియన్ కెప్టెన్ గా రికార్డులకెక్కాడు గిల్. విజయ్ హజారే, సునీల్ గవాస్కర్, విరాట్ కొహ్లీలతో సమానంగా రెండు టెస్టుల్లో వరుసగా రెండు సెంచరీలు పూర్తి చేసుకున్నాడు గిల్. అసలు ఈ సిరీస్ కు ముందు టీమిండియా కెప్టెన్ గా, బ్యాటర్ గానూ గిల్ ఎంపికపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే 2020-21 సీజన్ లో గబ్బా టెస్టులో మినహాయిస్తే టెస్టుల్లో విదేశాల్లో అందులోనూ SENA కంట్రీస్ లో గిల్ పెద్దగా ప్రూవ్ చేసుకోలేదు అన్నది విమర్శకుల మాట. పైగా 25ఏళ్ల కుర్రాడికి కెప్టెన్సీ ఇచ్చి మొదటి సిరీసే ఇంగ్లండ్ కు నాయకుడిగా పంపించారు. అతను టీమ్ ఎలా లీడ్ చేయగలడనే సందేహాలను వ్యక్తం చేశారు చాలా మంది క్రిటిక్స్. వాటన్నింటికీ సమాధానం చెప్తూ మొదటి టెస్టు లీడ్స్ లోనూ, రెండో టెస్టులోనూ ఎడ్జ్ బాస్టన్ లోనూ సెంచరీలతో దుమ్మురేపాడు గిల్. నిన్నటి సెంచరీ తర్వాత అయితే 2018 లో ఎడ్జ్ బాస్టన్ సెంచరీ కొట్టి కొహ్లీ ఎలా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడో అచ్చం అలానే గిల్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాడని పోలుస్తున్నారు. సో ఆ కింగ్ బాటలోనే ఈ ప్రిన్స్ కూడా నడిచి టీమిండియాకు విజయాలు అందిస్తాడేమో చూడాలి. ప్రస్తుతానికి రెండో టెస్టులో 114పరుగులతో నాటౌట్ గా ఉన్న గిల్ రెండో రోజూ జడ్డూ తో కలిసి ఇన్నింగ్స్ ను ఎంత డెప్త్ కి తీసుకువెళ్తాడనే దానిపై ఈ టెస్టుపై మన పట్టు డిసైడ్ అవుతుంది.





















