Reasons for Team India Failure in First test | Eng vs Ind మ్యాచ్ లో భారత్ ఓటమి పొందింది ఇలా | ABP Desam
వాస్తవానికి టీమిండియా కుర్ర జట్టు. అందులోనూ కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ బాధ్యతలు తీసుకున్నాక ఫస్ట్ అసైన్ మెంటే ఇంగ్లండ్ లో. బాజ్ బాల్ అనే పంథాతో టెస్ట్ క్రికెట్ గతిని మార్చిన ఇంగ్లండ్ ను వాళ్ల గడ్డపైనే ఢీకొనటం అంటే సాహసమనే చెప్పాలి. కానీ మనోళ్లు అద్భుతమే చేశారు. టాస్ గెలిచి ఇంగ్లండ్ బౌలింగ్ తీసుకుంటే మొదటి ఇన్నింగ్స్ లో ఓపెనర్ జైశ్వాల్, కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ పంత్ సెంచరీ మోత మోగించారు. ఫలితంగా 3 వికెట్ల నష్టానికి 430పరుగులు చేసిన టీమిండియా 41పరుగుల తేడాతో అనూహ్యంగా 7వికెట్లు కోల్పోయింది. 471కే ఆలౌట్ అయ్యింది. అసలు అంత స్కోరు చూసిన వాళ్లు ఎవరైనా ఈజీగా 600 కనీసం 500 కొడతారు లే అనుకుంటారు. కానీ మనోళ్లు 7వికెట్లను 41పరుగులకే పోగొట్టుకున్నారు. సరే ఏదో జెస్సీ భాయ్ కష్టపడి చచ్చీ చెడీ గొడ్డు చాకిరీ చేసి ఐదు వికెట్ల తీసి వాళ్లను 465కన్నా ఆపాడు. మళ్లీ మనోళ్లకు ఛాన్స్ వచ్చింది కదా. ఆపుకోవాలి కదా ఆత్రం. మళ్లీ ఫస్టాఫ్ సూపర్ హిట్. ఈసారి కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ మళ్లీ సెంచరీలు బాదారు. ఈసారి నాలుగు వికెట్ల నష్టానికి 333పరుగులు చేసిన భారత్..మళ్లీ అనూహ్యంగా సెకండాఫ్ ఫెయిల్ అయ్యి...364పరుగులకు ఆలౌట్ అయ్యింది. అంటే 31 పరుగుల తేడాతో 6 వికెట్లు సమర్పించేసుకుంది. ఫలితంగా 371 పరుగుల టార్గెట్ మాత్రమే ఇవ్వగలిగింది. ఈజీగా 400-450 మధ్య టార్గెట్ ఇవ్వగలిగే స్థితిలో ఉన్నా ఆ పని చేయలేక మన వీరులు వికెట్లు సమర్పించేసుకున్నారు. పోనీ బౌలర్లు అంత కష్టపడుతున్నారు. వికెట్లు రావటం లేదు. అవకాశాలు వచ్చినప్పుడైనా సద్వినియోగం చేసుకోవాలి. రెండు ఇన్నింగ్స్ లు కలిపి 9నుంచి 10 క్యాచ్ లు వదిలేశారు టీమిండియా ఆటగాళ్లు. ఘోరమైన తప్పిదం ఇది. అందులో ఒక్క యశస్వి జైశ్వాలే ఫస్ట్ ఇన్నింగ్స్ లో మూడు, రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ హీరో బెన్ డకెట్ క్యాచ్ ను వదిలేశాడు. ఫలితంగా ఐదుగురు సెంచరీలు చేసినా కూడా 148 టెస్ట్ క్రికెట్ చరిత్రలో లేని విధంగా టీమిండియా అనూహ్యంగా ఓడిపోయింది.



















