Eng vs Ind Fifth Test Fifth Day Highlights | ఐదో టెస్టులో సంచలన విజయం సాధించిన భారత్ | ABP Desam
ఒక్క బంతికి ఒక్కో నరం తెగిపోయింది ఇండియన్ ఫ్యాన్స్ కి. ప్రతీ బాల్ కి మియా భాయ్ విసురుతున్న బాల్స్ కి ఇంగ్లండ్ టెయిలెండర్స్ వణికిపోతుంటే...మనోళ్లకేమో చచ్చేంత టెన్షన్ వచ్చింది. మొత్తంగా సిరాజ్ మియా దయ వల్ల టీమిండియా ఓవల్ టెస్టులో 6 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. 374 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసే క్రమంలో ఐదో టెస్టు నాలుగో రోజు రూట్, బ్రూక్ శతకాలతో విజయానికి చేరువ చేసిన రెండో మూడో సెషన్ నుంచి మొదలైన భారత బౌలర్ల రివర్స్ ఎటాక్ ముందు ఇంగ్లండ్ నిలబడలేకపోయింది. మ్యాచ్ ఐదో రోజు వరకూ వెళ్లగా మొదటి బంతి నుంచే సిరాజ్ స్వింగ్ బాల్స్ తో వణికించేశాడు. అయితే ప్రసిద్ధ్ కృష్ణ పరుగులు ఇస్తుండటం...ఇంగ్లండ్ టెయిలెండర్ అట్కిన్సన్ భారీ షాట్లకు వెళ్తుండటంతో రెండు వైపులా టెన్షన్ ఉంది. లక్ష్యం ఉండే కొద్ది కరుగుతున్నా సిరాజ్ మాత్రం తలొగ్గలేదు. పాత బస్తీ పొగరు చూపిస్తూ సిరాజ్ వేసిన క్లీన్ యార్కర్ కు అట్కిన్సన్ ఔట్ అవ్వటంతో ఇంగ్లండ్ 367పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఫలితంగా భారత్ 6పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. సిరాజ్ 5వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్ ను నిలువరించారు. ఒంటి చేత్తోనూ బ్యాటింగ్ చేయటానికి క్రీజులోకి దిగిన క్రిస్ వోక్స్ తెగువను కూడా ఈ సందర్భంగా మెచ్చుకోకుండా ఉండలేం. మొత్తంగా ఈ విజయంతో భారత్... ఇంగ్లండ్ తో జరిగిన టెండూల్కర్ ఆండర్సన్ టెస్ట్ సిరీస్ ను 2-2 తో సమం చేసుకోగలిగింది.





















