Chess Ban in Afghanistan | ఆఫ్ఘనిస్తాన్లో చెస్‌పై నిషేధం | ABP Desam
తాలిబన్ ప్రభుత్వం ఆఫ్గానిస్థాన్‌లో వింత నిషేధం అమల్లోకి తీసుకువచ్చింది. అదే చెస్ పై బ్యాన్. చెస్ ఆడడంపై నిషేధం విధించడం తాలిబాన్లకు ఇది కొత్త కాదు. అమెరికా దాడులకు ముందు కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో చదరంగం ఆడడంపై నిషేధం విధించారు. ఇప్పుడు మళ్లీ తాత్కాలిక నిషేధం అంటున్నారు. నిజానికి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారం చేపట్టగానే ఆ దేశ జాతీయ చెస్ ఫెడరేషన్ అధికారులు సభ్యులు దేశం విడిచి వెళ్లిపోయారు. ఆ దేశంలో జాతీయస్థాయిలో చదరంగం ఆడే ప్రొఫెషనల్ ప్లేయర్లు 400-500 మంది ఉంటారని ఒక అంచనా. ఇప్పుడు వారంతా ఆటకు దూరమయ్యారు. చదరంగం ఆడితే తాలిబన్ల చేతల్లో కఠిన శిక్షలు ఉంటాయనే భయం వారిని పట్టి పీడిస్తోంది.
చదరంగం ఆడితే దైవ ప్రార్థనల పైన ఆసక్తి పోతుంది అనేది మత చాందస తాలిబన్ల ఉద్దేశ్యం అని విశ్లేషణ ఉంది. కానీ పురుషులాడే ఇతర ఆటలకు అనుమతి ఇచ్చి చదరంగం మీద మాత్రమే ఎందుకు నిషేధం విధిస్తున్నారంటే దానికి మరికొన్ని మతపరమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం చదరంగం ఆడడం 'షరియా ' చట్టానికి వ్యతిరేకం. గ్యాంబ్లింగ్ లాంటి ఆటలను షరియా చట్టం ఒప్పుకోదు కాబట్టి చదరంగాన్ని నిషేధిస్తున్నట్టు తాలిబన్లు చెప్పుకుంటున్నారు. కానీ అసలు కారణం అది కాదని ఇంకొందరు వాదులు చెబుతున్నారు.
నాలెడ్జ్, డెవలప్మెంట్, లాజిక్ ఇలాంటి విషయాల్లో ఇతరులు మెరుగఅవడం తాలిబన్లు సహించరు. ప్రజల్లో ఆలోచనా శక్తిని పెంచే ఎలాంటి అంశాన్ని కానీ క్రీడను గాని తాలిబన్ పెద్దలు ఒప్పుకోరు. దానిలో భాగంగానే ఆడేవాళ్లలో ఆలోచనా సామర్ధ్యాన్ని పెంచే చదరంగాన్ని వాళ్లు నిషేధించినట్టు పరిస్థితులను గమనిస్తున్న వారు చెబుతున్నారు. మరి రానున్న రోజుల్లో ఆ మత చాందస ప్రభుత్వం ఇంకెన్ని నిషేధాలు తెస్తుందో చూడాలి.





















