Punjab CM : ప్రధాని పర్యటనలో ఘటనపై పంజాబ్ సీఎం స్పందన
పంజాబ్ పర్యటన సందర్భంగా హుస్సైనీవాలాకు వెళ్తుండగా ప్రధాని మోదీకి ఎదురైన అనుభవంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ స్పందించారు. సుమారు 20 నిమిషాల పాటు ప్రధాని ఫ్లై ఓవర్ పై ఉండిపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని పట్ల తమకు గౌరవం ఉందన్నారు. భటిండా వద్ద తాను ప్రధాని మోదీని ఆహ్వానించాల్సి ఉందని... కానీ తనతో పాటు రావాల్సిన సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా తేలడం వల్ల వెళ్లలేకపోయానన్నారు. కరోనా బాధితులకు క్లోజ్ కాంటాక్ట్ గా ఉండటం వల్ల ప్రధానిని ఆహ్వానించడానికి వెళ్లలేదన్నారు. వాతావరణ పరిస్థితులు బాగాలేని కారణంగా పర్యటనను విరమించుకోవాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరామన్నారు. ఒక్కసారిగా రోడ్డు మార్గంలో ప్రయాణించాలన్న నిర్ణయంపై తమకు సమాచారం లేదన్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతాపర సమస్యలు తలెత్తలేదని వివరించారు.





















