Kota Srinivasa Rao Acting Skills | పాత్ర ఏదైనా సరే అవలీలగా మోసేయటం..కోటా మార్క్ స్టైల్
జనరల్ గా విలన్ అంటే పెద్దగా నవ్వాలి...మొహం మీద పెద్దపుట్టుమచ్చ ఉండాలి..బుర్రమీసాలు ఉండాలి..ఇలాంటి ఎన్నో స్టీరియో టైప్ ఆలోచనలను కోటా శ్రీనివాసరావు బద్ధలు కొట్టారు. నటుడిలో దమ్ముండాలే కానీ బోడి గుండుతో కూడా ప్రేక్షకులను వణికించొచ్చు అని నిరూపించిన నటుడు కోట శ్రీనివాసరావు. సినిమా భాష అంటే ఓ ప్రాంతానికి పరిమితమైపోయిన రోజుల్లో అచ్చ తెలంగాణ యాసను ఒడిసిపట్టి తెలుగు వెండి తెరపై వీర విజృంభణ చేశారు కోట శ్రీనివాసరావు. ప్రతిఘటనలో కాశయ్య, గాయంలో గురునారాయణ్, గణేశ్ లో హెల్త్ మినిస్టర్ సాంబశివుడు ఇలా కోటను గుర్తు తెచ్చుకుంటే తెలంగాణ యాస గుర్తుకు రాకమానదు. ఏం చేస్తావ్ తమ్మీ అని గదమాయించినా...గిదైతే ఖండిస్తున్నా ఖండఖండాలుగా ఖండించినా కోటాకే చెల్లింది. విజయవాడలో పుట్టి అక్కడే పెరిగి చెన్నైలో సినిమా అవకాశాల కోసం తిరిగిన వ్యక్తికి తెలంగాణ యాసపై ఆ పట్టు ఎలా వచ్చిందో ఇప్పటికీ ఆశ్చర్యమే. కేవలం విలన్ పాత్రలకే పరిమితమైపోలేదు. బాబూ మోహన్ తో కలిసి ఆయన పండించిన కామెడీ అప్పట్లో చాలా సినిమాలకు ఊపిరి పోసింది. విలన్ కూడా కామెడీ చేయొచ్చని..దాంతో ఆడియెన్స్ ని కన్విన్స్ చేయొచ్చని నిరూపించిన అతి కొద్ది మంది నటుల్లో కోట ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ మనతో కన్నీళ్లు పెట్టించే నటన కోట సొంతం. కోట అనేకంటే కోటా బాబాయ్ అంటేనే ఆ వాత్సల్యం వస్తుందేమో..లిటిల్ సోల్జర్స్ లో మేజర్ హరిశ్చంద్రప్రసాద్, అహనా పెళ్లంటలో పిసినారి లక్ష్మీపతి పాత్ర, మనీ సినిమాలో భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ అన్నా.. ఇడియట్ లో హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులేలో వెంకటేష్ తండ్రి పాత్ర, ఆ నలుగురు సినిమాలో వడ్డీ కోసం కాల్చుకునే తినే కోటయ్య పాత్ర ఇలా క్యారెక్టర్ ఏదైనా అల్లుకుపోవటమే కోట బాబాయ్ కి తెలిసిన పని. ఈ తరానికి అతడులో బాజిరెడ్డి, ఛత్రపతిలో అప్పలనాయుడుగా తన మార్క్ విలనీ మరోసారి చూపించిన కోట శ్రీనివాసర రావు..పరభాషా నటులపై తన ఆగ్రహాన్ని బహిరంగంగానే ప్రదర్శించేవారు. ఇంత మంది తెలుగు వాళ్లుండగా అసలు నటన అంటే ఏంటో తెలియని వాళ్లను తెచ్చిన మన మీద రుద్దుతున్నారని కోపగించుకునేవారు. ఎన్ని ఉన్నా తెలుగు సినిమా ఉన్నతంగా ఉండాలనేదే కోటా శ్రీనివాసరావు తపన. అలాంటి వ్యక్తులు ఈరోజు ఇక లేరన్న వార్త తెలుగు సినీ ప్రేక్షకులను కంట తడి పెట్టిస్తోంది.





















