Somasila Project : భారీవర్షాలు, వరదలతో పూర్తిగా కొట్టుకుపోయిన సోమశిల ఆప్రాన్..!
సోమశిల ప్రాజెక్ట్ ముందు ఉన్న కాంక్రీట్ నిర్మాణం... ఆప్రాన్ గతంలోనే ధ్వంసమైంది. ఇటీవల వదిలిన వరదనీటి తాకిడికి ఇది మరింతగా దెబ్బతిన్నది. రోజుకి ఐదు లక్షల క్యూసెక్కుల వరదనీరు విడిచిపెట్టడంతో సోమశిల కరకట్టలు పూర్తిగా కోతకు గురయ్యాయి. ఇక ఆప్రాన్ సంగతి సరే సరి. ఈ కాంక్రీట్ నిర్మాణం పూర్తిగా ధ్వంసమైంది. వీలైనంత త్వరగా దీనికి మరమ్మతులు చేపట్టాలని గతంలోనే పరిశీలనకు వచ్చిన అధికారుల బృందం తెలిపింది. అయితే ఆ తర్వాత మరమ్మతులకు వీలు లేకుండా పోయింది. అంతలోనే వరద రావడంతో ఆప్రాన్ మరింతగా ధ్వంసమైంది. ఇటీవల నెల్లూరు జిల్లా వరద ప్రాంతాల పరిశీలనకు వచ్చిన సీఎం జగన్.. ఆప్రాన్ మరమ్మతులకు 120 కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన వెంటనే సోమశిల గేట్లు పూర్తిగా మూసివేయడంతో ఆప్రాన్ ఇలా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. అయితే వరదనీరు మళ్లీ పెరిగే అవకాశం ఉండటంతో ఒకరోజు విరామం అనంతరం సోమశిల గేట్లు మళ్లీ పైకి ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు.