Viral Dance Video : సో క్యూట్ - బిహు డ్యాన్స్ చేసిన తల్లీకూతురు - సోషల్ మీడియాలో వీడియో వైరల్
Viral Dance Video : తల్లీ, కూతురు కలిసి చేసిన అస్సాం జానపద నృత్యం బిహు డ్యాన్స్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Dance Video : అస్సాం జానపద నృత్యం బిహు డ్యాన్స్ (Bihu Dance) ఎంతో ప్రసిద్ధి చెందింది. సాధారణంగా ఈ డ్యాన్స్ ను యువతీ, యువకులు అందమైన వేషధారణలో ఆకట్టుకునే స్టెప్పులతో చేతులను ఆడిస్తూ చేస్తారు. అయితే బిహు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు ఓ తల్లి, కూతురు. ఇది ఇంటర్నెట్ యూజర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అస్సామీ ప్రజల సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ నృత్యాన్ని చూసిన వారంతా వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా ఆ చిన్నారి వేసే క్యూట్ స్టెప్స్ వీడియోను మళ్లీ మళ్లీ చూసేలా చేస్తున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ వీడియో
ఈ వీడియో ప్రియాంక నబజ్యోతి గొగోయ్ (Priyanka Nabajyoti Gogoi) అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ అయింది. ఇందులో సాంప్రదాయ మఖేలా చాదర్ ధరించిన ఓ మహిళ, అస్సామీ సంస్కృతికి చిహ్నంగా కనిపించే వేషధారణలో ఉన్న చిన్నారితో డ్యాన్స్ చేయడం చూడవచ్చు. ఆ మహిళ తన చేతి కదలికలతో అందమైన స్టెప్పులు వేస్తూ కనిపించింది. అక్కడ ముందే నిల్చొన్న ఓ చిన్నారి ఆమెను అనుకరిస్తూ డ్యాన్స్ చేయడం మరింత ఆకట్టుకునేలా చేసింది. ఈ వీడియో సాంస్కృతిక వారసత్వానికి, తల్లీకూతుర్ల బంధానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్ చేయడం ప్రారంభించారు. మంత్రముగ్దులను చేసే ప్రదర్శనను చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. భవిష్యత్తులో ఆ చిన్నారి సెలబ్రెటీ అవుతుందని కొందరంటే.. మఖేలా చాదర్ వారికి బాగా కుదిరిందని ఇంకొందరన్నారు. పలువురు చూసేందుకు అందంగా ఉందని, ఎమోజీ గుర్తులతో తమ కామెంట్ ను పూర్తి చేశారు.
View this post on Instagram
అస్సాం జానపద నృత్యం - బిహు డ్యాన్స్
బిహు నృత్యం అస్సామీ సంస్కృతిలో అంతర్భాగంగా ఉంది. ఇది ప్రసిద్ధమైన బిహు పండుగ సమయంలో ప్రదర్శిస్తారు. అంతేకాదు ఇది అస్సామీ వారసత్వానికి అందమైన వ్యక్తీకరణగా చెప్పవచ్చు. సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన సన్నివేశాలు ఎప్పుడూ ఆన్లైన్ అందరి దృష్టినీ ఆకర్షిస్తాయని, అందరి హృదయాలనూ గెలుచుకుంటాయని ఈ వీడియో ద్వారా మరోసారి రుజువైంది.





















