భారత్ వాకిట్లో యుద్ధం: వైజాగ్ నుంచి వెళ్లిన ఇరాన్ నౌకపై అమెరికా దాడి.. హిందూ మహాసముద్రంలో ఏం జరిగింది?
గల్ఫ్ యుద్ధం మన గుమ్మం ముందుకు వచ్చేసిందా..? శ్రీలంక చేరువలో ఇరాన్ యుద్ధ నౌక IRIS DENAను పేల్చేయడంతో ఇప్పటి వరకూ మిడిల్‌ఈస్ట్‌లోనే జరుగుతుందనుకున్న యుద్ధం.. భారత్ ముంగిట్లోకి వచ్చేసినట్లైంది.

- శ్రీలంక సమీపంలో IRIS Dena అనే ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మరైన్ దాడి.
- MILAN-2026లో పాల్గొని విశాఖ నుంచి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
- దాడిలో 87 మంది మరణించారు, శ్రీలంక 30 మందిని రక్షించింది.
- ఇది గల్ఫ్‌కు దాటి ఇండియన్ ఓషన్‌కు యుద్ధ ప్రభావం విస్తరిస్తుందని సూచిస్తోంది.
Attack on Iris Dena: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం మిడిల్ ఈస్ట్‌లోనే కొనసాగుతుందని ప్రపంచం భావిస్తున్న సమయంలో, అకస్మాత్తుగా జరిగిన ఒక ఘటన భారత్ వ్యూహాత్మకంగా దృష్టి సారించాల్సిన పరిస్థితిని కల్పించింది. శ్రీలంక తీరానికి సమీపంలోని Indian Oceanలో ఇరాన్‌కు చెందిన యుద్ధనౌక IRIS Dena అమెరికా సబ్‌మరైన్ దాడిలో మునిగిపోయిన ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది.ఈ ఘటనలో 87మంది ప్రాణాలు కోల్పోయారు.భారత్‌కు అతిథిగా వచ్చిన నౌక తిరిగి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరగడం.. మనదేశానికి కూడా ఇబ్బందిగా మారింది.
విశాఖ నుంచి ఇరాన్‌కు వెళ్తూ...
కొద్ది వారాల క్రితమే విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ నౌకాదళ సమ్మేళనం. MILAN-2026లో పాల్గొని తిరిగి ప్రయాణం సాగిస్తునన క్రమంలో ఈ ఘటన జరగడం మరింత వ్యూహాత్మక ప్రాధాన్యం తీసుకొచ్చింది.IRIS Dena ఇరాన్ నౌకాదళానికి చెందిన ఆధునిక ఫ్రిగేట్. యాంటీ-షిప్ మిసైళ్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, హెలికాప్టర్ ఆపరేషన్ సామర్థ్యం వంటి ఆధునిక ఆయుధాలతో ఇది ఇరాన్ సముద్ర భద్రతలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫిబ్రవరిలో విశాఖపట్నం తీరంలో జరిగిన MILAN నౌకాదళ వ్యాయామంలో పాల్గొన్న ఈ నౌక, తరువాత ఇండియన్ ఓషన్ మార్గంగా తిరిగి ఇరాన్ వైపు ప్రయాణం మొదలుపెట్టింది. అయితే శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా అమెరికా నేవీ సబ్‌మరైన్ నుంచి ప్రయోగించిన టార్పెడో ఈ నౌకను తాకింది. భారీ పేలుడు సంభవించడంతో నౌక మునిగిపోయింది. దీనిపై అమెరికా ఓ వీడియోను విడుదల చేసింది.
ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. 87మంది చనిపోయినట్లు ప్రాథమిక అంచనా.. శ్రీలంక నేవీ 30మందిని పైగా కాపాడినట్లు సమాచారం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక అమెరికా సబ్‌మరైన్ ప్రత్యక్షంగా టార్పెడో ప్రయోగించి శత్రు యుద్ధనౌకను ముంచిన అరుదైన ఘటనగా దీనిని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

భారత్‌పై ప్రభావం
ఈ దాడి జరిగిన ప్రదేశం కూడా ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఇండియన్ ఓషన్ ప్రాంతాన్ని చాలా మంది వ్యూహాత్మక నిపుణులు “India’s strategic backyard”గా పేర్కొంటారు. అలాంటి ప్రాంతంలోనే ఈ ఘటన జరగడం భారత్‌కు కూడా పరోక్షంగా వ్యూహాత్మక సంకేతంగా భావిస్తున్నారు. ముఖ్యంగా భారత నౌకాదళం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నౌకపై కొన్ని వారాలకే దాడి జరగడం, ఈ ప్రాంతంలో జియోపొలిటికల్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయనే భావనను బలపరుస్తోంది.
ఇప్పటివరకు ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తత ప్రధానంగా మధ్యప్రాచ్యం పరిధిలోనే కనిపించింది. కానీ ఇప్పుడు ఈ సంఘటనతో యుద్ధ ప్రభావం గల్ఫ్ ప్రాంతం దాటి ఇండియన్ ఓషన్ వరకు విస్తరిస్తుందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సముద్ర మార్గాల భద్రత, అంతర్జాతీయ నౌకాయానంపై ప్రభావం, ముఖ్యంగా ఆసియా దేశాల వ్యూహాత్మక భద్రత వంటి అంశాలు ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తున్నాయి.
భారత్ ఈ విషయాన్ని కీలకంగానే తీసుకోవాలి. ఎందుకంటే మనం ఒకవైపు అమెరికాతో వ్యూహాత్మక వ్యాపార భాగస్వామ్యం కొనసాగిస్తూనే, మరోవైపు ఇరాన్‌తో కూడా ఆర్థిక, భౌగోళిక సంబంధాలను నెరుపుతున్నాం. అలాంటి సమయంలో హిందూ మహాసముద్రంలో జరిగిన ఈ ఘటన భారత్ డిప్లమాటిక్ బ్యాలెన్స్‌ను మరింత సున్నితంగా మార్చే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

భారత్‌కు అతిథిగా వచ్చిన నౌక తిరిగి వెళ్లే క్రమంలో ఇలా జరగడం నైతికంగా భారత్‌ను ఆత్మరక్షణలోకి నెడుతోంది. అంతే కాదు.. అంతర్జాతీయ నౌకా విన్యాసాలకు వచ్చిన ఓ యుద్ధనౌకపై దాడి చేయడం యుద్ధనీతి కాదనే వాదనలున్నాయి. అమెరికా చర్య సమంజసంగా లేదని వాదించేవారున్నారు.
మొత్తంగా చూస్తే, విశాఖపట్నం నౌకాదళ వ్యాయామంలో పాల్గొన్న ఇరాన్ యుద్ధనౌక కొద్ది రోజులకే ఇండియన్ ఓషన్‌లో అమెరికా దాడికి గురవడం సాధారణ సంఘటనగా కనిపించదు. ఇది మిడిల్ ఈస్ట్ ఘర్షణలు క్రమంగా మరింత విస్తృత భౌగోళిక పరిధిలోకి మారుతున్నాయా అనే ప్రశ్నను ప్రపంచానికి ముందుంచిన సంఘటనగా మారింది. ఇండియన్ ఓషన్ భవిష్యత్తులో కొత్త జియోపాలిటికల్ పోటీకి కేంద్రంగా మారుతుందా అనే చర్చ కూడా ఇప్పుడు మొదలైంది.
ట్రెండింగ్ వార్తలు























