Sharmila Meets Revanth Reddy: రేవంత్ రెడ్డితో షర్మిల భేటీ, త్వరలో చంద్రబాబును కలవనున్న రాజన్న బిడ్డ
YS Sharmila meets Revanth Reddy: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లడం విశేషం. అయితే ఇది పొలిటికల్ మీటింగ్ కాదు.
Sharmila invites Revanth Reddy for her sons wedding: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడిదే హాట్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డిని ఇంటికి వెళ్లి మరీ కలిశారు వైఎస్ షర్మిల. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లడం విశేషం. అయితే ఇది పొలిటికల్ మీటింగ్ కాదు. తన తనయుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుక, వివాహానికి రావాల్సిందిగా ఆమె, సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఆయనకు వివాహ ఆహ్వాన పత్రిక అందించారు. త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబుతో సైతం షర్మిల భేటీ కానున్నారని సమాచారం.
షర్మిల తనయుడి వివాహం..
షర్మిల తనయుడు రాజా రెడ్డికి అట్లూరి ప్రియతో ఈనెల 18న నిశ్చితార్థం జరుగబోతోందన్న విషయం తెలిసిందే. వివాహానికి కూడా ముహూర్తం పెట్టేశారు. ఫిబ్రవరి-17న వారి వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో షర్మిల పలువురికి వివాహ ఆహ్వాన పత్రికలు అందిస్తున్నారు. ఇటీవల ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద తొలి ఆహ్వాన పత్రికను ఉంచి.. తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు. కాబోయే వధూవరులను కూడా అక్కడికి తీసుకెళ్లారు. ఆ తర్వాత తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ ను కలిసి పెళ్లికి ఆహ్వానించారు. అనంతరం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.
వాస్తవానికి షర్మిలకు రేవంత్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. ప్రస్తుతం ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు కాబట్టి కచ్చితంగా వారిద్దరూ సయోధ్య కుదుర్చుకోవాల్సిందే. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తే రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు కలసి పనిచేయాల్సిందే. ఈ సందర్భంలో షర్మిల, రేవంత్ రెడ్డిని కలవడం విశేషం.
పాత విషయాలు మరచిపోయి..
గతంలో వైఎస్సార్టీపీ తరపున పాదయాత్ర చేసే సందర్భంలో రేవంత్ రెడ్డిపై కూడా ఆమె తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ముద్దాయిగా ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ విజయం తర్వాత కూడా ఆమె రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. సీఎం పదవి ఎవరికిస్తారనే విషయంలో రేవంత్ రెడ్డి మినహా మిగతా అందరి పేర్లు ప్రస్తావించారు షర్మిల. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అందరూ అభినందనలు తెలిపి, ఆయన్ను నేరుగా కలసి వచ్చినా షర్మిల మాత్రం దూరంగానే ఉన్నారు. తెలంగాణలో తన వల్లే కాంగ్రెస్ గెలిచిందని ఆమె చెప్పుకుంటున్నా కూడా ఆయన్ను మాత్రం కలవలేదు. అయితే ఇప్పుడిలా కొడుకు వివాహ మహోత్సవానికి ఆహ్వానించేందుకు షర్మిల, రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లడం విశేషం. ఈ భేటీతో వీరిద్దరి మధ్య ఉన్న భేదాలు తొలగిపోయాయని అనుకోవచ్చు.
ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న షర్మిల.. త్వరలో ఏపీ రాజకీయాల్లో బిజీ అవుతారనే అంచనాలున్నాయి. కాంగ్రెస్ లో చేరినా ఆమెకు ఇంకా ఏ పదవి కేటాయించలేదు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలను నియమిస్తారనే ఊహాగానాలు బలంగా వినపడుతున్నాయి. ఆమెకు పదవి వచ్చిన వెంటనే కాంగ్రెస్ లో చేరేందుకు చాలామంది వైసీపీ, టీడీపీ అసంతృప్తులు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. మరి ఏపీలో కాంగ్రెస్ కి షర్మిల ఎలా జీవం పోస్తారో వేచి చూడాలి.