(Source: ECI/ABP News/ABP Majha)
Weather Updates: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్, తెలంగాణలో వాతావరణం ఇలా..
తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రదేశాలలో కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు సూచించారు.
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో బుధవారం (సెప్టెంబరు 1న) వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బుధవారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఇంకొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. అయితే, వర్షాలకు సంబంధించి హెచ్చరికలు ఏమీ లేవని స్పష్టం చేశారు.
మంగళవారం (ఆగస్టు 1న) రాత్రి సమయంలో హైదరాబాద్ వాతావరణ విభాగం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. మర్నాడు అంటే సెప్టెంబరు 1న రాత్రి వరకూ తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రదేశాలలో కురిసే అవకాశం ఉందని సూచించారు. చాలాచోట్ల వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షప్రభావం ఉంటుందని వివరించారు.
తెలంగాణలో ఈ జిల్లాల్లోనే వానలు పడే అవకాశం
హైదరాబాద్‌లోని వాతావరణ విభాగం అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబరు 1న జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా..
ఏపీలో కోస్తా తీర ప్రాంత జిల్లాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీనితోపాటు కృష్ణా, గుంటూరు, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షం కురుస్తుందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ దక్షిణ ప్రాంతం మీదుగా విస్తరించిన ఉపరితల ద్రోణికి తోడు రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉండటం తోడవడంతో సెప్టెంబర్ 4వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురవనున్నట్లుగా అధికారులు వెల్లడించారు.
Also Read: TS Schools Reopen: తెలంగాణలో నేటి నుంచే ప్రత్యక్ష తరగతులు.. సర్కారు ఉత్తర్వులు