Huzurabad By-Election: ఇంటర్వ్యూ ద్వారా హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక.. రేపటి నుంచి దరఖాస్తులు..
హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని ఎంచుకుంటారనే ఊహాగానాలకు పార్టీ తెరదించింది. ఇంటర్వ్యూ ద్వారా హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక చేయనున్నట్లు తెలిపింది.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని ఎంచుకుంటారనే ఊహాగానాలకు పార్టీ తెరదించింది. ఇంటర్వ్యూ ద్వారా హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి గలవారు గాంధీభవన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుందని తెలిపారు. సెప్టెంబరు 5వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులు రూ.5000 డీడీ తీయాల్సి ఉంటుందని తెలిపారు. సెప్టెంబరు 6వ తేదీన పీసీసీ బృందం ఆశావహులను ఇంటర్వ్యూ చేసి 10న ఏఐసీసీకి నివేదిక అందిస్తుందని పేర్కొన్నారు. అధిష్టానం అభ్యర్థిని ఖరారు చేస్తుందని చెప్పారు. ఈ పీసీసీ బృందంలో భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబుతో పాటు కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్‌రెడ్డి ఉంటారని తెలిపారు.
అన్ని పార్టీల్లోనూ హుజురాబాద్ టెన్షన్..
తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నింటికీ హుజూరాబాద్ ఫీవర్ పట్టుకుంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీకైనా ప్రతీ క్షణం హుజురాబాద్ గురించి ఆలోచనే అంటే అతిశయోక్తి కాదు. అబ్బే మాకేం లెక్క లేదని టీఆర్ఎస్ ప్రగల్భాలు పలికినా.. చేతల్లో ఎంత కంగారు పడుతున్నారో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. బీజేపీ, టీఆర్ఎస్ పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. ఎంత త్వరగా ఎన్నికలు అయిపోతే అంత త్వరగా భారం దించేసుకుందామని చాలా మంది అనుకుంటున్నారు కానీ.. ఆ టెన్షన్ అలా పోస్ట్‌పోన్ అవుతూనే ఉంది. షెడ్యూల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎప్పుడు ఎన్నిక జరుగుతుందో కూడా తెలియదు. దీంతో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతాయో అనే టెన్షన్ అన్ని పార్టీలను పట్టి పీడిస్తోంది.
Read More: Huzurabad Political Tension : ఆలస్యం.. అమృతం.. విషం ! అన్ని పార్టీల్లోనూ హుజురాబాద్ టెన్షన్..!
ఎంత లేటయితే అంత ఎక్కువ ఖర్చు..
కాగా, హుజూరాబాద్‌లో ఎన్నికల షెడ్యూల్ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్నికల సమయం ఎంత పెరిగితే ఖర్చు కూడా అంతే పెరుగుతుందని రాజకీయ పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. అధికార టీఆర్ఎస్‌కు ఇది కాస్త ఇబ్బందికరంగానే కనిపిస్తోంది.