Telangana Rains: మానేరు వాగులో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు... 29 మంది ప్రయాణికులను రక్షించిన స్థానికులు... తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలు
తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. మానేరు వాగు వరదలో ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది.
తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట శివారులోని మానేరు వాగు వరదతో పోటెత్తింది. నీటి ప్రవాహానికి ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. సోమవారం సాయంత్రం వరదల్లో చిక్కుకున్న బస్సును జేసీబీ సహాయంతో తీయడానికి స్థానికులు ప్రయత్నించారు. కానీ వరద ఉద్ధృతి పెరగడంతో మరుసటి రోజు తీద్దామని అనుకున్నారు. మంగళవారం ఉదయం నీటి ప్రవాహం మరింత ఎక్కువై బస్సు వాగులో కొట్టుకుపోయింది.
అప్రమత్తంగా ఉండాలని సూచన
ఆదివారం రాత్రి నుంచి జిల్లాలో ఎడితెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. పలుచోట్ల వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
బస్సులో 29 మంది ప్రయాణికులు
గంభీరావుపేట, లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగు ఉద్ధృత ప్రవహించడంతో వంతెనపై నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. సోమవారం సాయంత్రం కామారెడ్డి నుంచి సిద్దిపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరద తాకిడికి వాగులో చిక్కుకుంది. ఒక టైర్ కిందికి దిగి ఆగింది. ఆ సమయంలో బస్సులో 29 మంది ప్రయాణీకులు ఉన్నారు. గ్రామస్థులు బస్సులని వారందరినీ రక్షించారు.
భారీ వరద
ఎగువ మానేరు జలాశయానికి భారీగా వరద చేరడంతో వాగులో వరద పెరిగింది. అయితే వరదను తక్కువగా అంచనా వేసి బస్సు డ్రైవర్ ముందుకు పోనివ్వడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. జేసీబీ సాయంతో బస్సును బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు, గ్రామస్థులు ప్రయత్నించారు. వరద మరింత పెరగడంతో మంగళవారం బస్సు వరదలో కొట్టుకుపోయింది.