Prakasam TDP Leaders : వెలిగొండ ప్రాజెక్టును నోటిఫై చేయండి... షెకావత్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ నేతల విజ్ఞప్తి..!
వెలిగొండ ప్రాజెక్టును కృష్ణా బోర్డు పరిధిలో నోటిఫై చేయకపోవడం వివాదాస్పదమవుతోంది. అన్ని అనుమతులు ఉన్నప్రాజెక్టును తక్షణం గెజిట్‌లో పెట్టాలని ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు కోరుతున్నారు.
ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు తమ జిల్లా నీటి వనరుల కోసం ప్రత్యేకమైన పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అసలే కరువు జిల్లా అయిన ప్రకాశం ఎడారిగా మారిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో లేఖలు రాసిన వారు ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. నేరుగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర జలవనరుల మంత్రితో సమావేశమై తమ జిల్లా పరిస్థితిని వివరించారు. అన్యాయం చేయవద్దని కోరారు.
వెలిగొండ ప్రాజెక్టు కేఆర్ఎంబీ పరిధిలో లేకపోవడంతో ప్రకాశం జిల్లాకు నీటి కష్టాలు..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఇటీవల కేంద్రం తీసుికుంటున్న నిర్ణయాలు కూడా ప్రకాశం జిల్లా సాగునీటి రంగానికి ఇబ్బందికరంగా మారాయి. ఆ నిర్ణయాలు అమలు జరిగితే ప్రకాశం జిల్లా రైతులకు చుక్క నీరు అందవని వారు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం వెలిగొండ ప్రాజెక్టును కృష్ణా యాజమాన్య బోర్డు పరిధిలో చేర్చకపోవడం. విభజన చట్టంలో వెలిగొండ ప్రాజెక్టు ప్రస్తావన ఉంది. తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టుల తరహాలోనే వెలిగొండకూ అనుమతులు ఉన్నాయన్నారు. కానీ ఇటీవల కేఆర్ఎంబీని నోటిఫై చేసిన గెజిట్‌లో వెలిగొండ ప్రస్తావన లేదు. దీంతో ప్రకాశం జిల్లా రైతుల గుండెల్లో రాయిపడినట్లయింది. అయితే కేంద్రం ఈ ప్రాజెక్టును గుర్తించింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవ చూపడంతో ఏఐబీపీ పథకం కింద నిధులు మంజూరయ్యాయి. ఇంత కాలం ఈ ప్రాజెక్టు గురించి ఎక్కడా అభ్యంతరాలు వ్యక్తం చేయని తెలంగాణ .. కేంద్రం నిధులు మంజూరు చేయగానే కృష్ణాబోర్డుకు లేఖ రాసింది. అనుమతి లేని ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయడం సరి కాదని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై ఏపీ ప్రభుత్వం స్పందించలేదు. బహుశా.. కేఆర్ఎంబీ వివరణ అడిగితే అప్పుడు స్పందించే అవకాశం ఉంది. టీడీపీ నేతలు ఈ లోపే తెలంగాణ సీఎంకు లేఖ రాశారు. ప్రకాశం జిల్లా రైతులకు అంతో ఇంతో నీరు అందించే ప్రాజెక్టు వెలిగొండ అని దానిపై ఫిర్యాదులు చేయడం సరి కాదన్నారు. విభజన చట్టాన్ని గౌరవించి లేఖను వెనక్కి తీసుకోవాలని కోరారు.
రాయలసీమ ఎత్తిపోతలతో ఆయుకట్టుకు ఆగిపోనున్న నీరు..!
మరో వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై కూడా ప్రకాశం జిల్లా నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు . అ ప్రాజెక్టు నిర్మిస్తే శ్రీశైలం నుంచి దిగువకు నీరు రావని అదే జరిగితే సాగర్ ఆయుకట్టు కింద చివరిలో ఉండే ప్రకాశం జిల్లా పొలాలకు నీరు అందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ ద్వారా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం రాయలసీమ ఎత్తిపోతల నిర్మించి తీరాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికీ కీలకమైన పనులు కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఓ వైపు సాగర్ ఆయుకట్టుకు నీరందే పరిస్థితి లేకపోవడం.. మరో వైపు దాదాపుగా పూర్తయిన వెలిగొండ ప్రాజెక్టును ఉపయోగించుకోకుండా చేయడం వంటి పరిణామాలతో ప్రకాశం జిల్లా రైతులు చిక్కుల్లో పడిపోయారు. ఈ పరిస్థితుల్లో కామ్‌గా ఉండటం కన్నా ఏదో ఓ పోరాటం చేయదన్న ఉద్దేశంతో టీడీపీ నేతలు తమ ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
ప్రకాశం జిల్లా ఎడారి కాకుండా కాపాడాలంటున్న టీడీపీ నేతలు
కృష్ణా బోర్డు గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టును చేర్చడమే లక్ష్యంగా ప్రస్తుతం టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రభుత్వం అసలు అన్ని ప్రాజెక్టుల్ని నోటిఫై చేయాడాన్ని వ్యతిరేకిస్తోంది. వివాదంలో ఉన్నప్రాజెక్టుల్ని మాత్రమే నోటిఫై చేయాలని కోరుతోంది. అందుకే వెలిగొండ ప్రాజెక్టును ప్రత్యేకంగా గెజిట్‌లో పెట్టాలని కోరడం లేదు. దీంతో ఒక వేళ కేంద్రం ఎవరి డిమాండ్లను పట్టించుకోకపోతే వెలిగొండ ప్రాజెక్టు.. నిరుపయోగంగా మిగిలిపోతుంది. అంతే కాదు అక్రమ ప్రాజెక్ట్ గా ముద్రపడే ప్రమాదం ఉంది. అధికారంలో ఉండటం వల్ల వైసీపీ నేతలు గొంతెత్తలేకపోతున్నారు. టీడీపీ నేతలు ఢిల్లీ వరకూ వెళ్లి ప్రకాశం జిల్లా ప్రయోజనాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.