Women Cricker Names for Vizag Cricket Stands: స్మృతి మందాన అడిగింది.. లోకేష్ చేశారు. వైజాగ్ స్టేడియంలో ఈ మార్పులు…!
Women Cricketer Names: ఇండియన్ విమెన్ స్టార్ క్రికెటర్ స్మృతి మందాన ఈ మధ్య ఏపీ ఐటీమంత్రి లోకేష్‌కు ఓ విన్నపం చేశారు. నారా లోకేష్ సూపర్ స్పీడ్‌లో దానిని ఇంప్లిమెంట్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Vizag Cricket Stadium Honours Women Cricketers: వైజాగ్ క్రికెట్ స్టేడియం ఓ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. ఇద్దరు లెజెండరీ క్రికెటర్లకు అరుదైన గౌరవం దక్కబోతోంది. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ చొరవతో ACA-VDCA స్టేడియంలో రెండు స్టాండ్లకు మహిళా క్రికెటర్లు.. మిథాలీ రాజ్, రవి కల్పన పేర్లు పెట్టనున్నారు. విమెన్ క్రికెట్ షైనింగ్ స్టార్ స్మృతి మందాన సూచనకు నారా లోకేష్ వెంటనే స్పందించారు.
అసలేం జరిగింది?
ఆగస్ట్ నెల చివర్లో వైజాగ్‌లో 'బ్రేకింగ్ బౌండరీస్' అనే కార్యక్రమం జరిగింది. ఇండియన్ మహిళా క్రికెట్ జట్టు సభ్యులందరూ హాజరైన ఆ ఈవెంట్‌కు మంత్రి నారా లోకేష్ చీఫ్ గెస్ట్. ఆ కార్యక్రమంలో ఇండియన్ టీమ్ కెప్టెన్ హార్మన్, లెజెండరీ క్రికెటర్ మిథాలీ, స్మృతి మందానతో కలిసి లోకేష్ ఓ సెషన్‌లో పాల్గొన్నారు. ఈ సెషన్‌లో దేశంలోని స్టేడియాల్లో పురుష క్రికెటర్ల పేర్లతో ఎన్నో స్టాండ్స్ ఉన్నా, మహిళా క్రికెటర్లకు అలాంటి గుర్తింపు దక్కడం లేదని ఆమె ప్రస్తావించారు. మహిళల విజయాలను గుర్తించి, వారి పేరుతో స్టాండ్స్ ఏర్పాటు చేస్తే ఎంతో మంది అమ్మాయిలకు అది స్ఫూర్తినిస్తుందని ఆమె అన్నారు
వెంటనే స్పందించిన లోకేష్
స్మృతి మంధాన సూచనకు మంత్రి లోకేష్ వెంటనే స్పందించారు. ఈ ఆలోచనను ఆచరణలో పెట్టడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA)తో మాట్లాడారు. ఫలితంగా, భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంతర్జాతీయ వికెట్ కీపర్ రవి కల్పన పేర్లను స్టాండ్లకు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

అక్టోబర్ 12న ప్రారంభోత్సవం
ఇప్పుడు వైజాగ్ స్టేడియంలోని ఆ కొత్త స్టాండ్లను అక్టోబర్ 12న, ఇండియా-ఆస్ట్రేలియా మహిళల ప్రపంచ కప్ మ్యాచ్ సందర్భంగా ప్రారంభించనున్నారు. మహిళా క్రికెటర్ల సేవలను గుర్తించి, లింగ సమానత్వానికి ప్రాధాన్యం ఇవ్వడంలో ఇదొక కీలక ముందడుగు అని లోకేష్ పేర్కొన్నారు.
ఇప్పటి వరకూ.. దేశంలో ఎక్కడా మహిళా క్రికెటర్ల పేరుతో ఎలాంటి స్టాండ్‌లు, పెవిలియన్‌లు లేవు. విశాఖ స్టేడియం.. ఈ సరికొత్త చరిత్ర లిఖిస్తోంది. ఇద్దరు మహిళా క్రికెటర్ల పేర్లను స్టాండ్లకు పెట్టడం ద్వారా వారికి గౌరవాన్ని తీసుకొస్తోంది. మిథాలీ రాజ్ ఇండియన్ విమెన్ క్రికెట్‌కు ఓ ఐకాన్. భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి. భారత క్రికెట్ టీమ్‌కు సుదీర్ఘ కాలం కెప్టెన్‌గా పనిచేశారు. రవి కల్పన… ఓ సామాన్య కుటుంబం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారిణి. ఆమె తండ్రి విజయవాడలో ఓ ఆటో డ్రైవర్. కుటుంబ పరిస్థితులతో అవరోధాలు ఎదురైనా.. కల్పన.. అంచెలంచెలుగా ఎదుగుతూ భారత జట్టులో స్థానం సంపాదించారు. వీరిరువురూ ఎంతో మందికి స్ఫూర్తి అని వీరి పేర్లను స్టాండ్లకు పెట్టడం వల్ల మరింతమంది మహిళా క్రికెట్‌లోకి రావడానికి స్పూర్తిదాయకంగా ఉంటుందని ACA తెలిపింది. దేశంలోని ఇతర క్రికెట్ అసోసియేషన్లు కూడా చొరవ చూపితే మరింత మంది మహిళా క్రీడాకారులకు గుర్తింపు వస్తుంది.





















