Supreme Court Judges Oath: చర్రితలో తొలిసారి... 9 మంది సుప్రీం జడ్జిలు ప్రమాణ స్వీకారం... మొత్తం జడ్జిల సంఖ్య ఎంతంటే?
Supreme Court Judge Swearing In: చర్రితలో తొలిసారిగా 9 మంది సుప్రీం జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వీరితో మంగళవారం ప్రమాణ స్వీకారం చేయించారు.
సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారి 9 మంది జడ్జిలు మంగళవారం ఒకేసారి ప్రమాణస్వీకారం చేశారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు అదనపు భవనం ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కొత్తగా ప్రమాణం చేసిన వారితో కలిపి సీజేఐతో సహా సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య 33కు చేరింది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయం మేరకు తొలిసారి సుప్రీం జడ్జిల ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. సంప్రదాయం ప్రకారం సీజేఐ కోర్టు రూమ్‌లోనే ప్రమాణ స్వీకారాలు జరగాల్సి ఉంది. కానీ కరోనా దృష్ట్యా ఆడిటోరియంలో నిర్వహించారు.
కొత్త జడ్జిలు వీరే
జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ నాగరత్న, జస్టిస్ రవికుమార్, జస్టిస్ సుందరేశ్, జస్టిస్ మాధుర్య త్రివేది, జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ సుప్రీంకోర్టు జడ్జిలుగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం తొమ్మిది మంది పేర్లను ఆగస్టు 17న కేంద్రానికి సిఫారుసు చేసింది. ఈ ప్రతిపాదనకు ఆగస్టు 26న రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
తదుపరి సీజేఐలు వీరే
ఒకేసారి ముగ్గురు హైకోర్టు మహిళా న్యాయమూర్తులకు పదోన్నతి కల్పించారు. వీరిలో ప్రస్తుత కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బి.వి.నాగరత్న ఉన్నారు. జస్టిస్ నాగరత్న 2027లో దేశానికి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జస్టిస్ విక్రమ్‌నాథ్, సుప్రీంకోర్టులో ఇప్పటివరకు సీనియర్ న్యాయవాదిగా ఉన్న తెలుగు వ్యక్తి జస్టిస్ పి.ఎస్.నరసింహ కూడా భవిష్యత్తులో ప్రధాన న్యాయమూర్తులు అవ్వనున్నారు. సీనియారిటీ పరంగా 19వ స్థానంలో ఉన్న జస్టిస్ సూర్యకాంత్ 2025 నవంబర్ 24వ తేదీ నుంచి 2027 ఫిబ్రవరి 9వరకు సీజేఐగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత జస్టిస్ విక్రమ్‌నాథ్ ఆ ఏడాది సెప్టెంబర్ 23 వరకు సీజేఐగా బాధ్యతలు చేపడతారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు జస్టిస్ నాగరత్న ప్రధాన న్యాయమూర్తి కొనసాగుతారు. వీరి తర్వాత జస్టిస్ పి.ఎస్. నరసింహ ఆ స్థానాన్ని నిర్వర్తిస్తారు.
తెలుగు రాష్ట్రాల నుంచి
ప్రమాణస్వీకారం చేసిన కొత్త జడ్జిలలో తెలంగాణ హైకోర్టుకు ప్రాతినిధ్యం వహించిన జస్టిస్ హిమా కోహ్లి ఉన్నారు. జస్టిస్ జె.కె. మహేశ్వరి అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా 2019 అక్టోబర్ 7 నుంచి 2021 జనవరి 5వరకు బాధ్యతలు నిర్వహించారు. జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తే కావడం విశేషం. దీంతో తెలుగు రాష్ట్రాలతో పరిచయమున్న వ్యక్తులు ముగ్గురు సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందినట్లు అయ్యింది. జస్టిస్ నరసింహ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడితే జస్టిస్ కోకా సుబ్బారావు, జస్టిస్ ఎన్వీ రమణ తర్వాత సీజేఐ అయిన మూడో తెలుగు వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు.