Tollywood Drugs Case: అమ్మతోడు నాకేం సంబంధం లేదు.. కనీసం నేను వక్కపొడే వేసుకోను.. ఈడీ ఆఫీసులో బండ్ల గణేశ్
డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ను విచారిస్తున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఈడీ కార్యాలయానికి వచ్చారు.
బండ్ల గణేశ్ ఈడీ కార్యాలయం వద్ద మీడియాకు కనిపించారు. తాను పూరీ జగన్నాథ్ ను కలిసేందుకు వచ్చానని, డ్రగ్స్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. తాను కనీసం వక్కపొడి కూడా వేసుకోనని చెప్పారు. అయితే బండ్ల గణేశ్ మాత్రం ఈడీ కార్యాలయానికి రావడం ఆశ్చర్యం కలిగించింది. ఈరోజు దర్శకుడు పూరి జగన్నాథ్ ను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. ఈడీ నుంచి నోటీసులు అందుకున్న వారిలో బండ్ల గణేశ్ లేరు. పూరీని దాదాపు 8 గంటలపాటు అధికారులు విచారించారు. ఇలాంటి సమయంలో ఈడీ కార్యాలయంలో బండ్ల ప్రత్యక్షంకాగానే అందరూ ఆశ్చర్యపోయారు
అమ్మతోడు నాకేం సంబంధం లేదు. పూరీని కలిసేందుకే వచ్చా. ఆయన వచ్చి చాలా సేపు అయింది. అందుకే ఏం జరుగుతుందోనని వచ్చా. కానీ నన్ను అధికారులు కనీసం లోపలికి కూడా రానివ్వలేదు. అసలు నేను వక్కపొడి కూడా వేసుకోను. నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు.
- బండ్ల గణేశ్, సినీ నిర్మాత
బండ్ల గణేశ్ నిర్మాతగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పలు సినిమాలు వచ్చాయి. టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో అనేకమంది ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వారందరినీ వరుసగా విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే దర్శకుడు పూరీ జగన్నాథ్ ను విచారణకు పిలిచారు.
పూరీ జగన్నాథ్ లావాదేవీలు అడిగిన ఈడీ అధికారులు
ఇప్పటికే కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు దాఖలైంది. ఈ కేసుకు డ్రగ్స్ వినియోగంతో సంబంధం లేదు. కేవలం వాటిని కొనుగోలు చేయడానికి జరిగిన లావాదేవీలు గురించే విచారణ జరగనుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ సెక్షన్ 3, 4 కింద కేసులు నమోదయ్యాయి. విచారణలో అక్రమ లావాదేవీలు గుర్తిస్తే ఆ మేరకు అదనపు కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. విచారణలో భాగంగా ఈడీ పూరీ జగన్నాథ్ ఆరేళ్ల ట్రాన్సాక్షన్స్ కావాలని కోరింది. ఈ సందర్భంగా పూరీ తన మూడు అకౌంట్లలో 2015 - 2021 మధ్య జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వివరాలను ఈడీకి అందించినట్లు సమాచారం. ఈ కేసుతో సంబంధం ఉన్న మిగతా సినీ ప్రముఖుల ఖాతాలను కూడా ఈడీ తనిఖీ చేయనుంది.