(Source: ECI/ABP News/ABP Majha)
Yadadri Brahmotsavam: నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. హాజరు కానున్న సీఎం రేవంత్, మంత్రులు
Yadadri Brahmotsavam: యాదగిరిగుట్టపై వెలసిన లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు హాజరు కానున్నారు.
Telangana News: యాదగిరిగుట్టపై వెలసిన లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి బ్రహ్మోత్సవాలు కావడంతో ఆ పార్టీ నాయకులు కూడా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. తొలి రోజు స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వస్తీవాచనం, అంకురారోపణం, విశ్వక్సేనారాధన, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు హాజరు కానున్నారు. స్వామివారికి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ తో పాటు సీనియర్ మంత్రులు వేడుకల్లో పాల్గొని బయలుదేరి భద్రాచలం వెళ్ళనున్నారు. ఈ మేరకు సీఎంతోపాటు మంత్రుల రాకకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో కొండపైన దేవస్థానం అధికారులు ఆంక్షలు విధించారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఈవో రామకృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. కొండపైకి వచ్చే భక్తుల వాహనాలను అనుమతించడం లేదని స్పష్టం చేశారు. సీఎం, మంత్రుల పర్యటన తర్వాత యధావిధిగా భక్తులకు స్వామివారి దర్శనం కొండపైకి అనుమతి ఉంటుందని ఆయన వెల్లడించారు.
డోలోత్సవంతో వేడుకలు ముగింపు
సోమవారం నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. 11 రోజులపాటు జరగనున్న స్వామి వారి బ్రహ్మోత్సవాలు 21న జరిగే శృంగార డోలోత్సవంతో ముగియనున్నాయి. ప్రధాన ఆలయ ఉద్ఘాతన తర్వాత రెండోసారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర మాడ వీధుల్లో స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజులపాటు స్వామి వారికి నిత్య మొక్కు, కళ్యాణాలు, సుదర్శన నారసింహ హవన పూజలను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
పదివేల మంది కూర్చునేల ప్రత్యేక కళ్యాణ మండపం
స్వామి వారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. పదివేల మంది కూర్చునేలా ప్రత్యేక కళ్యాణ మండపాన్ని ఆలయ అధికారులు సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 17న స్వామివారి ఎదుర్కోలు, 18న తిరు కళ్యాణ మహోత్సవం, 19న స్వామి వారి దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. 13 నుంచి స్వామి వారి అలంకార సేవలు కొనసాగనున్నాయి. ఈనెల 15 నుంచి సంగీత సాహిత్య మహాసభలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజులపాటు ఆర్జిత సేవలైన నిత్య, శాశ్వత మొక్కు కళ్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం వంటి పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు.