Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Telangana News | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనకు ఒక్కరోజు ముందే కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ, ఎమ్మెల్యేలపై మంత్రి కొండా సురేఖ కోపంగా ఉన్నారని తెలుస్తోంది.
Warangal Congress Politics | వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో పాలాభిషేకం చిచ్చు రేపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటన సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారిపోయారు. వరంగల్ లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మంత్రి కొండా సురేఖ (Konda Surekha) సభ ప్రాంగణం వద్ద ఏర్పాట్లలో ఉంటే.. ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఎయిర్ పోర్టుకు నిధులు విడుదల చేసినందుకు రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. దీంతో కొండా సురేఖ తాను లేకుండా ఎలా చేస్తారు, తన సమక్షంలో ఇలాంటివి జరగాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి సురేఖ, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నవంబర్ 19న వరంగల్ పర్యటనకు ముందే ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి కొండా సురేఖ మధ్య సమన్వయ లోపం తలెత్తింది. వరంగల్ సభను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మంత్రి కొండా సురేఖ సభ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ క్రమంలో హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్ లో సభ వేదికను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో సభకు ముందు రోజే ఇందిరమ్మ మహిళ శక్తి స్టాల్స్ (Indiramma Shakti Stalls) ను ప్రారంభించాలని నిర్ణయించారు.
స్టాల్స్ ప్రారంభించేందుకు కొండా సురేఖ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఎంపీ, ఎమ్మెల్యేల కోసం చూస్తున్నారు. కానీ ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమంలో మునిగిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం కోసం రూ.205 కోట్లు విడుదల చేసిన సందర్భంగా ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో ఎంపీ కడియం కావ్య, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి, మేయర్ సుధారాణి తోపాటు ముఖ్య నేతలు పాలాభిషేకం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాను లేకుండా పార్టీకి విధేయత చాటుకున్నారా అంటూ కొండా సురేఖకు కోపం వచ్చింది
ఎమ్మెల్యేలపై అలిగిన మంత్రి కొండా సురేఖ
మంత్రి కొండా సురేఖ లేని సమయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం ఆమెకు కోపం తెప్పించింది. తాను స్టాల్స్ ప్రారంభించడం కోసం సభ ప్రాంగణంలో వేచి ఉంటే మీరు అభిషేకాలు చేస్తున్నారు, నేను ఉండవద్దా అని ఎమ్మెల్యేలపై కొండ సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు చేసిన పనికి మంత్రిగారు అలిగారు. దీంతో కొండా సురేఖ, సిటీలోని ఎమ్మెల్యేలు, ఎంపీ మధ్య సమన్వయ లోపం ఏర్పడి ఎడమొహం పెడమొహం అన్నట్లుగా వరంగల్ కాంగ్రెస్ నేతల పరిస్థితి తయారైంది.
Also Read: Ghost News: 2 నెలల్లో 30 మంది మృతి, గ్రామానికి దెయ్యం పట్టిందని వణికిపోతున్న ప్రజలు - వీడిన మిస్టరీ
కావాలనే కొండా సురేఖను పక్కన పెట్టారా..!
సభ ప్రాంగణంలో స్టాల్స్ ప్రారంభం మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో ఫిక్స్ చేసినదే. అదే సమయంలో రేవంత్ రెడ్డి చిత్ర పటానికి ఎయిర్ పార్ట్ ప్రాంగణాల్లో పాలాభిషేకం చేశారు. అయితే పాలాభిషేకం అనుకోకుండా చేశారా, లేక మంత్రి కొండా సురేఖ ను కావాలనే ఈ పాలభిషేకానికి దూరంగా ఉంచేలా ఎంపీ, ఎమ్మెల్యేలు ఏకమయ్యారా అని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ పాలాభిషేకంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు అందరూ కొండా ఫ్యామిలీ అంటే గిట్టనివారే నని వినిపిస్తోంది. కనుక కావాలనే ఆమెను పాలాభిషేకానికి దూరంగా ఉంచారా, ఈ విషయాన్ని కొండా సురేఖ ఎలా తీసుకుంటారో అనేది త్వరలో తేలనుంది. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు వరంగల్ కాంగ్రెస్ నేతల్లో గ్రూపు రాజకీయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.